ఆదివారం, 17 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By jsk
Last Updated : బుధవారం, 11 మే 2016 (19:03 IST)

హైందవ ధర్మాన్ని విడిచిపెడతానన్న జగద్గురువులు శ్రీ శంకరాచార్యులు

హిందూ ధర్మం మీద దాడి జరిగిన ప్రతిసారీ, ధర్మం తన వైభవాన్ని మర్చిపోయిన ప్రతిసారీ పరమాత్ముడు అనేక మంది మహాపురుషులను ప్రేరేపణ చేసి, కొన్ని సందర్భాల్లో స్వయంగా తానే అవతరించి, ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నాడు. సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి సరిగ్గా 2524 సంవత్సరాల క్రితం, 509లో వైశాఖ శుద్ధ పంచమి రోజున దక్షిణ భారతదేశంలోని నేటి కేరళ రాష్ట్రంలో కాలిడి గ్రామంలో శివ గురువు, ఆర్యాంబ దంపతులకు బిడ్డగా, వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి, ధర్మ పునః ప్రతిష్ట చేయడానికి పరమశివుడి అంశతో శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులు అవతరించారు.
 
చిన్న వయసులోనే వేదాంతాలను, తత్వశాస్త్రాన్ని (ఫిలాస‌ఫీ), మెటాఫిజిక్స్, థియోల‌జీ మొదలైన ఇతర శాస్త్రాలను కంఠస్థం చేశారు బాలశంకరులు. 8 ఏళ్ళ వయసులోనే సన్యాసం స్వీకరించారు. ఆ సమయంలో భారతదేశంలో బౌద్ధ, జైన మతాలు, నాస్తికవాదం విపరీతంగా ప్రబలాయి. ప్రజలంతా హిందూ ధర్మాన్ని వదిలి, నాస్తికం, చార్వాక మతాల వైపు నడవడం ప్రారంభించారు. దాదాపు 90 శాతం ప్రజలు సనాతన ధర్మాన్ని విడిచి పెట్టేశారు.
 
ధర్మోద్ధరణకు శంకరులు గొప్ప సాహసం చేశారు. ఇతర మతస్థులతో శాస్త్ర చర్చలు చేసి, తాను చర్చలో ఓడిపోతే హైందవ ధర్మాన్ని విడిచిపెడతానని, ఒకవేళ అవతలివారు ఓడిపోతే వారు సనాతన హిందూ ధర్మాన్ని స్వీకరించాలని చెప్పి, తన వాదన ప్రతిభతో బౌద్ధ, జైనమతాలను అనుసరించే రాజుల వద్దకు వెళ్ళి, శాస్త్రచర్చలు నిర్వహించి, తాను ఒక్కడే జైన, బౌద్ధ మతాలకు సంబంధించిన అనేక మంది పండితులతో శాస్త్రీయంగా వాదించి, వారిని ఓడించి, వైదిక ధర్మంలోకి వారిని తీసుకువచ్చారు.
 
ఆ చర్చల సమయంలో వచ్చిందే అద్వైత సిద్ధాంతం. యావత్ భారతదేశం పాదచారిగా పర్యటించి, హిందూ ధర్మాన్ని ప్రచారం చేశారు. శంకరాచార్యులు కనుక అవతరించి ఉండకపోతే హిందు అనేవాడు గాని, హిందూ ధర్మం కానీ మిగిలి ఉండేవి కావు. ఈయన కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించి 477లో మహనిర్యాణం చెందారు. తన 32 ఏళ్ళ జీవితకాలంలో అనేక రచనలు చేశారు. జీవుడు, దేవుడు, ఇద్దరూ ఒక్కటే, ఇద్దరికి బేధంలేదు అంటూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. 
 
ప్రస్థాన త్రయంగా చెప్పబడే భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, కర్మసిద్ధాంతాలకు భాష్యం రాశారు. అనేక స్తోత్రాలు అందించారు. శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య మొదలైన 6 మతాలను స్థాపించారు. కలియుగంలో ప్రజల్లో శౌచం తగ్గిపోయిందని, దేవాలయాల్లో ఉన్న దేవ‌తా విగ్రహాల శక్తిని ఇటువంటి మానవ సమూహం తట్టుకోలేదని, దేవాతశక్తిని శ్రీ చక్ర యంత్రాల్లోకి ప్రవేశపెట్టారు.
 
ఆత్మతత్త్వాన్ని తెలుసుకొన్నవాడు, నేను జఢత్వాన్ని కాను, చైతన్యాన్ని అని నిశ్చితమైన జ్ఞానం కలవాడు, అతడు చండాలుడైనా, బ్రాహ్మణుడైనా, అతనే నాకు గురువు. ఇది తథ్యమంటూ శంకరాచార్యుల వారు ఎలుగెత్తి చాటారు. అలా వచ్చిందే మనీషా పంచకం. జ్ఞాన్మార్గాన్ని పునరుద్ధరించిన శంకరులు, కేవలం జ్ఞానబోధకే పరిమితం కాక, అనేక స్తోత్రాలు అందించారు.
 
వైదిక ధర్మాన్ని ఎప్పటికి ప్రచారం చేసే విధంగా భారతదేశం నాలుగు దిక్కుల నాలుగు వేదాలకు ప్రతీకగా నాలుగు మఠాలను దక్షిణ భారతదేశం శృంగేరీలో శారదపీఠం, ఉత్తరమున ఉత్తరాఖండ్‌లో జ్యోతిర్‌మఠం, తూర్పున పురీలో గోవర్థన పీఠం, పశ్చిమాన ద్వారకలో ద్వారకాపీఠం స్థాపించారు. ఎప్పుడో 2492 సంవత్సరాల క్రితం ఈయన ఏర్పాటు చేసిన పరంపర ఈనాటికి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. అదేకాకుండా సన్యాస ఆశ్రమాన్ని సంస్కరించి పది సంప్రదాయాలను ఏర్పరిచారు.
 
భారతదేశంలో తన వాదన పటిమతో అందరిని ఓడించి కాశ్మీర్‌లో ఉన్న సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. వారి తర్వాత అంతటి మేధావి, సూక్ష్మదర్శి ఇంకొకరు రాలేదు. అందువల్ల సర్వజ్ఞ పీఠాన్ని శంకరాచార్యుల తర్వాత ఈ 2000 సంవత్సరాలలో ఎవరు అధిరోహించలేదు. కానీ ఇప్పుడా సర్వజ్ఞపీఠం, కాశ్మీర్ సరస్వతీ దేవాలాయం ముష్కరులు, దేశద్రోహుల దాడిలో శిధిలమైపోయింది. 
 
శంకరులు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహిస్తారనగా, వారితో వాదించడానికి ఒక 8 ఏళ్ళ పిల్లవాడు వచ్చాడు. ఉద్దండులనే ఓడించాను, నీతో వాదించేదేంటీ అని శంకరాచార్యులు అనలేదు. ఆ పసిపిల్లవాడితో కూడా అమోఘమైన శాస్త్రచర్చ జరిపారు. ఇది శంకరుల యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తోంది. అంత గొప్పవారైనా, కాస్తంత అహంకారం కూడా శంకరాచార్యుల వారికి లేదు. ఇప్పటికే వారు అందించ సాహిత్యాన్నే భారతదేశమంతటా అనుసరిస్తున్నారు.