మోహన్ బాబు యూనివర్శిటీలో అధిక ఫీజులు వసూలు.. స్పందించిన మంచు మనోజ్!!
సినీ నటుడు మోహన్ బాబు స్థాపించిన మోహన్ బాబు యూనివర్శిటీలో నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో మోహన్ బాబు వ్యక్తిగత ఇమేజ్‌కు మచ్చ ఏర్పడేలా ఉన్నాయి. ఈ వర్శిటీలో ఫీజులు, ఇతర ఛార్జీలు ఓ రేంజ్‌లో ఉన్నాయంటూ విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ అసోసియేషన్లు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ మండిపడుతున్నరు. ఇదే అంశంపై ఏఐసీటీఈకి పేరెంట్స్ అసోసియేషన్ లేఖ కూడా రాసింది. ఆ లేఖలో పేరెంట్స్ తీవ్రమైన ఆరోపణలే చేశారు. యూనివర్సిటీలో పెద్ద మొత్తంలో ట్యూషన్ ఫీజులు, బిల్డింగ్ ఫీజులు, ఐటీ ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, బలవంతంగా యూనిఫామ్ కొనుగోలు చేయిస్తున్నారని, డే స్కాలర్స్ కూడా ఖచ్చితంగా మధ్యాహ్న భోజనం మెస్‌లో తినాలని కండిషన్ పెట్టారంటూ పేర్కొంది. ఇలాంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పుడు అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయని గుర్తు చేసింది.
ఈ విషయంపై మోహన్‌బాబు కుమారుడు, సినీ నటుడు మంచు మనోజ్ స్పందించారు. తన తండ్రి మంచిమనిషి అంటూనే.. విద్యార్థుల ఆందోళనలకు ఫుల్ సపోర్ట్ ప్రకటించారు. విద్యార్థుల ఆందోళన తనను బాధపరిచిందన్న మంచు మనోజ్.. విషయాన్ని వర్సిటీ ఛాన్స్‌లర్ మోహన్‌బాబు దృష్టికి తీసుకెళతానని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఏఐఎస్ఎఫ్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఈ అంశంపై వర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్‌ని వివరణ కోరినట్లు చెప్పారు.
రాయలసీమ వాసులు, విద్యార్థుల ప్రయోజనాలకే.. ఛాన్సలర్ మోహన్‌బాబు ప్రాధాన్యం ఇస్తారని ఆయన తెలిపారు. ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్శిటీ, శ్రీవిద్యానికేతన్ సంస్థలు మోహన్ బాబు పెద్ద తనయుడు విష్ణు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. విష్ణు నిర్వహణలో ఉన్న విద్యాసంస్థలపై ఆరోపణలు వస్తే ఖండించాల్సిన మనోజ్.. రివర్స్‌లో అక్కడ ఆందోళనలు చేస్తున్న వారికి మద్దతు ఇవ్వడం అంటే వారి ఫ్యామిలీలో విభేదాలు నడుస్తున్నాయనే టాక్ నడుస్తోంది.