రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనె కాంబినేషన్‌లో-83 టీజర్ విడుదల
భారత క్రికెట్ చరిత్రలో 1983 సంవత్సరం భారత క్రికెట్ జట్టు విశ్వ విజేతగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విజయం అంత సులభంగా దక్కలేదు. ఎన్నో ఉత్కంఠమైన మలుపులతో దక్కిన గెలుపు అది. అలాంటి ఆసాధారణ ప్రయాణాన్ని వెండితెరపై `83` సినిమాగా ఆవిష్కరిస్తున్నారు డైరెక్టర్ కబీర్ ఖాన్. అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ సమర్పణలో కబీర్‌ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో దీపికా పదుకొనె, సాజిద్ నడియద్‌వాలా, కబీర్ ఖాన్, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంటమ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మించారు. ఈ సినిమాలో కపిల్ డేర్ డెవిల్స్ ప్రస్థానం ఎలా సాగింది? వారికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనే విషయాలను 83 సినిమాలో ఆవిష్కరించారు డైరెక్టర్ కబీర్ ఖాన్.
కపిల్ దేవ్‌గా రణ్వీర్ సింగ్, కపిల్ సతీమణి రూమీ భాటియాగా దీపికా పదుకొనె, సునీల్ గవాస్కర్‌గా తాహిర్ రాజ్ బాసిన్, కృష్ణమాచార్య శ్రీకాంత్‌గా జీవా, మదన్ లాల్‌గా హార్డీ సందు, మహీంద్రనాథ్ అమర్‌నాథ్‌గా సకీబ్ సలీమ్, బల్వీందర్ సంధుగా అమ్మి విర్క్, వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణిగా సాహిల్ కత్తార్, సందీప్ పాటిల్‌గా చిరాగ్ పాటిల్, దిలీప్ వెంగ్‌సర్కార్‌గా అదినాథ్ కొతారె, రవిశాస్త్రిగా కార్వా.. మేనేజర్ మాన్‌సింగ్‌గా పంకజ్ త్రిపాఠి తదితరులు నటించారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 1983 జూన్ 25న ఫైనల్ జరిగింది. అందులో వెస్టిండీస్, ఇండియా జట్లు తలపడ్డాయి. వెస్టిండీస్ కెప్టెన్ వివియన్ రిచర్డ్స్ క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పేసింది. ఆ క్యాచ్ కోసం కెప్టెన్ కపిల్ దేవ్ 20 గజాలు వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్ పట్టడం హైలైట్‌గా నిలిచింది. ఆ క్యాచ్ సీన్‌ను ఈ టీజర్‌లో ఆవిష్కరించారు. గూజ్ బమ్స్ తెప్పించే ఇలాంటి సన్నివేశాలెన్నో ఈ సినిమాలో ఉన్నాయని, ఇండియన్ క్రికెట్‌లో మరచిపోలేని అమేజింగ్ జర్నీతో రూపొందిన 83 చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 24న గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.