శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:29 IST)

హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు డమ్మీ ఈవీఎంలు : వైకాపా సరికొత్త ఎత్తులు?

వెస్ట్ గోదావరి జిల్లాలో డమ్మీ ఈవీఎంలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు రహస్యంగా తరలిస్తుండగా జిల్లాలోని కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో ఇవి బయటపడ్డాయి. దాదాపు 350కు పైగా ఈవీఎంలను ఓ మినీ వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీటిని జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయానికి తరలించారు. 
 
మరోవైపు, మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపా సరికొత్త ప్రచారానికి తెరదీసింది. ఓటర్లకు అవగాహనా కల్పించే ప్రచారంలో భాగంగ, నమూనా (డమ్మీ) ఈవీఎం బ్యాలెట్ పత్రాన్ని ముద్రించింది. ఇందులో తమకు ఎన్నికల సంఘం కేటాయించిన సంఖ్య 4ను సక్రమంగానే ముద్రించింది. కానీ, టీడీపీకి ఈసీ రెండో నంబరును ముద్రించగా, దాన్ని మూడో నంబరుగా ముద్రించి ఓటర్లను గందరగోళానికి గురిచేసే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దీనిపై టీడీపీ నేత బుట్టా సుధాకర్ యాదవ్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. 
 
కాగా, వైఎస్. జగన్మోహన్ రెడ్డి తాజాగా రాజకీయ పరిస్థితులు, ప్రచారంపై రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నివాసంలో పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. ఆ తర్వాత బుధవారం నుంచి ఆయన గుంటూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో డమ్మీ ఈవీఎంలు హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు తరలించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.