ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : శనివారం, 25 మే 2019 (18:22 IST)

పులివెందుల అసెంబ్లీ ఓటర్లకు అభ్యర్థి జగన్ కూడా నచ్చలేదట...

ముగిసిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ శాసనసభ ఎన్నికల్లో నోటా (నన్ ఆఫ్ ది ఎబౌవ్)కు గణనీయమైన ఓట్లు వచ్చాయి. అరకు అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కంటే నోటాకే అధిక ఓట్లు వచ్చాయి. అంతేనా, నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్. జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన పులివెందుల అసెంబ్లీ స్థానంలో కూడా వేలాది మంది ఓటర్లకు జగన్ నచ్చలేదు. ఇలాంటి వారంతా నోటా గుర్తుకు ఓటు వేశారు. 
 
పైగా, గత ఎన్నికల్లో అర శాతం ఉన్న నోటా ఓటింగ్.. ఈ దఫా 1.05 శాతానికి పెరిగింది. ఉదాహరణకు కడప జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులకు వ్యతిరేకంగా 17714 మంది ఓటర్లు నోటాను బలపరిచారు. రాజంపేట, కడప లోక్‌సభ పరిధిలో ఏకంగా 21899 మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. 
 
అంతేనా, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పోటీ చేసిన పులివెందుల అసెంబ్లీ స్థానంలోనూ రెండు వేల మందికి పైగా ఓటర్లు నోటాకు ఓటు వేశారు. అంటే ఈ స్థానం నుంచి పోటీ చేసిన జగన్‌తో పాటు.. ఇతర అభ్యర్థులు కూడా వారికి నచ్చకపోవడంతో వారంతా నోటా గుర్తుకు ఓటు వేశారు. 
 
కడప జిల్లాలో నోటాకు వచ్చిన వచ్చిన ఓట్లను పరిశీలిస్తే, కడప లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14,692, రాజంపేట లోక్‌సభ పరిధిలోని మూడు అసెంబ్లీల పరిధిలో 7207 (మొత్తం 21899) చొప్పున ఓట్లు పోలయ్యాయి. అలాగే, ప్రొద్దుటూరు 1514, కమలాపురం 1589, మైదుకూరు 1613, జమ్మలమడుగు 2254, కడప 1411, రాజంపేట 1449, కోడూరు 1552, రాయచోటి 2202, బద్వేలు 1974, పులివెందుల 2156 చొప్పున మొత్తం 17714 ఓట్లు పోలయ్యాయి.