శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : ఆదివారం, 24 మార్చి 2019 (12:55 IST)

గాజువాకలో పవన్ కళ్యాణ్‌ గెలుపు అంత ఈజీ కాదమ్మా...

విశాఖ జిల్లాలోని గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు అంత ఈజీ కాదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఇతర పార్టీల నేతలు కూడా అంత తక్కువైనవారేం కాదన్నది వారి అభిప్రాయంగా ఉంది. 
 
ముఖ్యంగా, గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి బలమైన కారణం కాపు ఓట్లు అధికంగా ఉండటం. యువత కూడా ఎక్కువే. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున ఇక్కడ పోటీ చేసిన చింతలపూడి వెంకట్రామయ్య గెలుపొందారు. ఇవన్నీ కలిసి వస్తాయని పవన్‌కల్యాణ్‌ భావిస్తున్నారు. నామినేషన్‌ వేసిన తర్వాత ఆయన మొదట గాజువాకలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మంచి స్పందన వచ్చింది. 
 
గాజువాకలో టీడీపీ నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. ఈయన సున్నిత మనస్కుడు. గాజువాకలో హౌస్‌ కమిటీ సమస్యకు పరిష్కారం చూపించారు. అందరికీ అందుబాటులో వుంటారనే పేరు మంచి పేరుంది. స్థానిక నేతలకే పట్టం కట్టాలని ఆయన వర్గం ప్రచారం ప్రారంభించింది. 
 
ఇకపోతే, వైకాపా నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన తిప్పల నాగిరెడ్డే మళ్లీ ఇక్కడ పోటీకి దిగారు. విశాఖ మాజీ మేయరు పులుసు జనార్దనరావు బీజేపీ నుంచి నామినేషన్‌ వేశారు. ఇక్కడ ఎవరికి వారికి వర్గాలు ఉన్నాయి. యువత ఓట్లు కీలకంగా మారాయి. వారిని ఆకర్షించే వారికే విజయం లభిస్తుందనే వాదన వినిపిస్తోంది.