బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 25 డిశెంబరు 2021 (19:14 IST)

తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా, ఎంత స్పీడ్ వెళుతున్నాడంటే..?

అతివేగం ప్రమాదకరం.. వాహనాలను నెమ్మదిగా నడపండి.. వేగం కన్నా ప్రాణం మిన్న అంటూ రకరకాలుగా బోర్డులను ఏర్పాటు చేసి అవగాహన కల్పించే ప్రయత్నం రవాణాశాఖాధికారులు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాల వద్ద వాహనాలను నెమ్మదిగా నడపాలని సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. 

 
కానీ చాలామంది భక్తులు నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తిరుమల ఎగువ ఘాట్ రోడ్డులో కారు బోల్తా పడింది. అతి వేగంగా కారును నడపటంతోనే కారు బోల్తా పడినట్లు గుర్తించారు టిటిడి సిబ్బంది. 

 
ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మిగిలిన ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. లింక్ రోడ్డు సమీప మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణించే వారు నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించారు. 130 కిలో మీటర్లకు పైగా వేగంగా కారు నడిపినట్లు తెలుస్తోంది. 

 
ప్రమాదం జరిగిన తరువాత స్పీడామీటర్ ముళ్ళు 130వద్ద నిలిచిపోయింది. ఘాట్ రోడ్డులో అంత వేగంగా వాహనాలను నడుపకూడదని తెలిసినా నెల్లూరుజిల్లా నుంచి వచ్చిన భక్త బృందం ఎందుకు అంత స్పీడుగా వాహనాన్ని నడపారు అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.