శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 21 ఆగస్టు 2017 (20:51 IST)

వైద్యులు స్థానికంగానే ఉండాలి... వ్యాధులు ప్రభలకుండా ముందస్తు చర్యలు

అమరావతి : విధులు నిర్వహిస్తున్న చోటే వైద్యులు నివశించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. దీనివల్ల ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడం సాధ్యమవుతుందని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మ

అమరావతి : విధులు నిర్వహిస్తున్న చోటే వైద్యులు నివశించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. దీనివల్ల ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడం సాధ్యమవుతుందని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి సీఎస్ దినేష్ కుమార్ సోమవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. 
 
డెంగీ, క్షయ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాతా,శిశు మరణాలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మహిళల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉండటంపై సీఎస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 463 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలు పాటు పనిచేసేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ విషయంలో గిరిజన ప్రాంతాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎస్ చెప్పారు. 24 గంటల వైద్య సేవలను గిరిజన ప్రాంతాల్లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ప్రారంభించాలని చెప్పారు. 
 
ఇందుకు అవసరమైన  వైద్యులను నియమించుకోవాలని అన్నారు.  రాష్ట్రంలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కనీస మౌలిక సదుపాయాలను తప్పనిసరిగా కల్పించడంతోపాటు వాటి నిర్వాహణకు అవసరమైన నిధులను కూడా కేటాయించాలని స్పష్టం చేశారు. పీహెచ్ సీలను జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేయాలని చెప్పారు. అన్ని ఆసుపత్రులకు నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా విద్యుత్ శాఖ అధికారులతో చర్చించాలని చెప్పారు.  గ్రామీణ ప్రాంతంలోని ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన ‘చంద్రన్న సంచార వైద్యం’ మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. 
 
వివిధ వ్యాధులకు సంబంధించి రోగులకు ఇస్తున్న మందుల సంఖ్య రెండేళ్లలో 320 నుంచి 448కి పెంచినట్లు చెప్పారు.  బడ్జెట్లో నిధుల కేటాయింపు కూడా పెంచినట్లు చెప్పారు. అయితే, రోగులకు ఇస్తున్న మందుల సంఖ్య పెరగడాన్ని సీఎస్ దినేష్ కుమార్ ప్రస్తావించారు. మందులు శాతం పెరగడం ప్రజల ఆరోగ్యం మెరుగ్గా లేదనడానికి ఒక సంకేతంగా భావించాలని చెప్పారు. పీపీపీ విధానంలో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి కూడా సమావేశంలో చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ సుజాత శర్మ, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ గోపినాథ్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ అరుణకుమారి, ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ దుర్గా ప్రసాద్, ఔషధ నియంత్రణశాఖ అధికారులు పాల్గొన్నారు.