శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 మే 2016 (16:44 IST)

ప్రత్యేక హోదా ఇవ్వక పోతే ప్రజలు కొట్టేలా ఉన్నారు : అనకాపల్లి ఎంపీ

విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే సీమాంధ్ర ప్రజల నుంచి తాము తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీకి చెందిన అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ అన్నారు. అందువల్ల విభజన చట్టం మేరకు గత యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమకు ప్రత్యేక హోదాను ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వాలని ఆయన కోరారు. 
 
సోమవారం లోక్‌సభ శూన్య గంట సమయంలో ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ అన్ని విధాలా నష్టపోయిందని, ఆ లోటును పూడ్చాలని కోరారు. ప్రత్యేక హోదా ఇవ్వక పోవడంవల్ల ఏపీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారంటూ ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. 
 
విభజన కారణంగా ఐటీ, మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఇతర కంపెనీలన్నీ తెలంగాణాకు వెళ్ళిపోయాయన్నారు. వీటిని ఏపీలో మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉందన్నారు. అదేసమయంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తమ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణాన్ని చేపట్టారని గుర్తు చేశారు. నిధుల సమస్యతో కొట్టుమిట్టాడుతున్న ఏపీలో అన్ని సవ్యంగా సాగాలంటే ప్రత్యేక ఇవ్వాల్సిందేనన్నారు. 
 
ఎఫ్డీఐలను ఆహ్వానిస్తున్నామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే అన్నీ సవ్యంగా సాగుతాయని అవంతి సభకు తెలిపారు. అందుకే ప్రత్యేక హోదా ఇవ్వాలని, దీని ప్రత్యేక కేసుగా పరిగణించాలని ఆయన కోరారు.