శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 27 ఆగస్టు 2014 (14:59 IST)

వాకౌట్ అయ్యారుగా.. సభలో ఎలా కూర్చుంటారు? యనమల

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో వైకాపా నేతలు హడావుడి చేస్తున్నారు. వాకౌట్ అయినా సభకు హాజరయ్యారు. దీనిపై ఆర్థిక మంత్రి యనమల ఫైర్ అయ్యారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి, ఆ తర్వాత సభలోనే ఎలా కూర్చుంటారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో భాగంగా బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో రైతు రుణమాఫీపై సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్లు జగన్‌ ప్రకటించారు. 
 
ఆ తర్వాత వైసీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ వెనక్కి వచ్చి సభలో కూర్చున్నారు. వాకౌట్‌ చేసిన సభ్యులు తిరిగి ఎలా వస్తారంటూ మంత్రి యనమల ప్రశ్నించారు. వైసీపీ సభ్యులు అందరూ వెళ్లిపోయాక జ్యోతుల నెహ్రూ ఒక్కరే ఎందుకు కూర్చున్నారని... వారికి నిబంధనలు తెలియవా అని ప్రశ్నించారు. అంతేకాకుండా, తమ నాయకుడు మాత్రమే వాకౌట్‌ చేశారే కానీ, తాము వాకౌట్‌ చేయలేదని జ్యోతుల నెహ్రూను చెప్పమనండని యనమల కోరారు. 
 
ఇంతలో స్పీకర్ జోక్యం చేసుకుని సబ్జెక్ట్‌పై నిరసన తెలిపి వాకౌట్‌ చేసిన తర్వాత దానిపై మాట్లాడే హక్కు లేదన్నారు. మాట్లాడతామంటే వాకౌట్‌ చేయనట్లు అవుతుందన్నారు. అందువల్ల వాకౌట్‌పై స్పష్టత ఇచ్చి మాట్లాడాలని స్పీకర్‌ కోడెల సూచించారు. దీనిపై జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నిరసన తెలిపి వాకౌట్‌ చేసిన మాట వాస్తవమే అని తమ నాయకుడు సహా సభ్యులందరం వాకౌట్‌ చేశామని చెప్పారు. అయితే రుణమాఫీపై వ్యవసాయ మంత్రి ప్రసంగం ముగిసిందని భావించి తాను సభలోకి వచ్చినట్లు జ్యోతుల నెహ్రూ సమర్థించుకున్నారు.