శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ESHWAR
Last Updated : సోమవారం, 28 జులై 2014 (12:34 IST)

అది సచివాలయమా.. లేక... నరక కూపమా?.. మేం రాంబాబోయ్...

సచివాలయంలో ఏపీ మంత్రుల చాంబర్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటినా నేటికి చాంబర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కనీసం మంత్రుల చాంబర్లలో కుర్చీలూ.. ఫాక్స్‌లు పంపించేందుకు వెసులుబాటు లేకపోవడంతో మంత్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో కొందరు సచివాలయానికి రాకుండా ఇంటి నుంచే పరిపాలన సాగిస్తుండగా, మరి కొందరు జీఏడీ అధికారుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు.
 
మంత్రులతో పాటు వారి పీఏలు, పీఎస్‌లు, ఓఎస్‌డిలు ఇబ్బందులు పడుతున్నారు. నేటికీ కొందరు మంత్రుల చాంబర్లలో పనులు జరుగుతుండటం, మరి కొందరు పీఎస్‌లకు కనీసం ఫర్నీచర్ కూడా ప్రభుత్వ యంత్రాంగం సమకూర్చకపోవడంతో, నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా సచివాలయం జె బ్లాక్‌లో మంత్రుల చాంబర్లలో కనీస వసతుల ఏర్పాట్లలో జీఏడి అధికారులు అలసత్వం వహించడంతో వారి పరిస్థితి ఇబ్బందిగా మారింది. 
 
డిప్యూటి సీఎం కే.ఈ. క్రిష్ణమూర్తి చాంబర్‌లో నేటికి పనులు కొనసాగుతున్నాయి. దీంతో డిప్యూటి సీఎం సెక్రటేరియట్ కంటే తన ఇంటి నుండే పరిపాలన సాగిస్తున్నారు. మరో ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్పకు చాంబర్‌లో ఆయన కూర్చోవడానికి పాత కుర్చీని అధికారులు ఏర్పాటు చేయడం విశేషం. అలాగే దేవాదాయ శాఖా మంత్రి మాణిక్యాలరావు చాంబర్‌లో పీఎస్‌కు గదులు కేటాయించలేదు.

ఒక వేళ కేటాయించినా కనీసం ఫోన్‌తో పాటు ఫాక్స్ వంటి సౌకర్యాలు సమకూర్చలేదు. దీంతో ఆ శాఖా పిఎస్ మంత్రిగారు టూర్‌లో ఉన్నప్పుడు ఆయన చాంబర్‌నే తన కార్యాలయంగా ఉపయోగించుకుంటున్నారు. ఏ మంత్రి చాంబర్ నుండి అయినా జీఏడి అధికారులకు వసతులు గురించి ఫోన్ చేస్తే, ఇంకా బడ్జెట్ రిలీజ్ కాలేదు, స్టాక్ లేదు వంటి సమాధానం వస్తుండడంతో మంత్రుల పిఎస్‌లు, ఓఎస్‌డీలు ఇబ్బందులు పడుతున్నారు. 
 
సీఎస్‌కి అదే పరిస్థితి 
మంత్రుల మాట ఇలా ఉంటే పరిపాలానకు మూలస్థంభం అయిన సీఎస్ సైతం ఇబ్బందులు తప్పడం లేదు. కేవలం చాంబర్ కేటాయించినప్పటికి, పరిపాలనకు సంబంధించి మంత్రుల చాంబర్ల ఫోన్, ఫాక్స్ నెంబర్లు కూడా అందుబాటులో లేవు. దీంతో సిఎస్ తనకు అవసరాన్నిబట్టి వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరిలతో ఫోన్‌లో మాట్లాడుతూ పనులు కానిస్తున్నారు.

అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం కేటాయించిన ఎల్ బ్లాక్‌లోని ఎనిమిదో అంతస్తులో ఆయన చాంబర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇంకా మూడు నెలల కనీసం సమయం పడుతుందని ఆర్ అండ్ బి అధికారులు చెబుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి, సీఎస్ రూంల పరిస్థితి ఇలావుంటే ఇక మంత్రుల చాంబర్ల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 
 
ముఖ్యమంత్రి, సిఎస్‌తో పాటు మీడియాకు తిప్పలు తప్పలేదు. ఏపీ సెక్రటేరియట్‌కు నాలుగు బ్లాక్‌లు కేటాయించిన తర్వాత అందులో మీడియాలకు కనీసం ఒక రూం కూడా కేటాయించలేదు. గతంలో సి బ్లాక్ ముందు ఉన్న మీడియా పాయింట్ తెలంగాణా వారికి వెళ్లడంతో ఏపిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు మీడియా పాయింట్‌తో పాటు పబ్లిసిటీ సెల్ లేక పోవడంతో ఎల్ బ్లాక్ మందు చెట్ల క్రింద మీడియా ప్రతినిధులు పడిగాపులు కాయల్సిన పరిస్థితి. స్వయంగా ముఖ్యమంత్రితో పాటు సిఎస్‌లు మీడియాకు కనీస సౌకర్యాలు కేటాయించాలని సూచించినా నేటికి అవి అందుబాటులోకి రాలేదు. దీంతో మీడియా ప్రతినిధులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.