శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (11:03 IST)

ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన సమగ్రసర్వే.... ఆదివారం కూడా...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సమగ్ర సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే శుక్రవారం నుంచి ప్రారంభమై మూడు రోజుల పాటు సాగుతుంది. మూడో రోజున ఆదివారం వచ్చినప్పటికీ ఆ రోజున కూడా సర్వే యధావిధిగా సాగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ఈ విషయంపై ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. మూడు రోజుల సమగ్ర సర్వేను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. 
 
వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, గీత, నేత కార్మికులకు ఇస్తున్న పింఛన్లలో చాలా వరకు బోగస్‌వి ఉన్నట్టు తాము గుర్తించామని, వీటిని తొలగించేందుకే ఈ సర్వే చేస్తున్నట్టు తెలిపారు. అర్హులైన వారిపేర్లను తొలిగించే ప్రసక్తే లేదని, అందువల్ల అర్హులైన వారు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. పింఛన్ల కోసం కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చని, ఈ దరఖాస్తులను నియమ, నిబంధనల మేరకు పరిశీలించి, పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. 
 
సర్వే సందర్భంగా గ్రామాలు, మున్సిపాలిటీల్లోని అన్ని గృహాలకు అధికారిక బృందాలు వెళతాయని, ప్రతి ఇంటిలో ఉండే వారి వివరాలు సేకరిస్తామని పరకాల ప్రభాకర్ తెలిపారు. ఇందుకోసం గ్రామస్థాయి నుండి రాష్టస్థ్రాయి వరకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామని వివరించారు. అన్ని రకాల కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నామని, ఇప్పటికే 94 శాతం ఆధార్ నెంబర్లు లభించాయన్నారు. మిగతా ఆరు శాతం మందికి కూడా ఆధార్ నెంబర్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.