శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 27 నవంబరు 2017 (19:34 IST)

సింగపూర్‌కు ఏపీ రైతుల బృందం... ఎందుకు?

అమరావతి: సింగపూర్‌కు 34 మందితో కూడిన రెండో విడత రాజధాని ప్రాంత రైతుల బృందం సోమవారం బయలుదేరింది. సచివాలయంలోని మూడో బ్లాక్ నుంచి బస్సులో బయలుదేరిన రైతుల బృందానికి డిప్యూటీ ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ సోమవారం

అమరావతి: సింగపూర్‌కు 34 మందితో కూడిన రెండో విడత రాజధాని ప్రాంత రైతుల బృందం సోమవారం బయలుదేరింది. సచివాలయంలోని మూడో బ్లాక్ నుంచి బస్సులో బయలుదేరిన రైతుల బృందానికి డిప్యూటీ ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ సోమవారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ, వ్యవసాయంతో పాటు వ్యాపారంలోనూ రైతులు ప్రావీణ్యత సంపాదించడానికి సింగపూర్ పర్యటన ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 
 
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. నాలుగు రోజుల పాటు రెండో విడత రైతుల బృందం సింగపూర్‌లో పర్యటిస్తుందన్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి నారాయణ మాట్లాడుతూ, సింగపూర్ పర్యటన కోసం 123 మంది రైతులను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. గత నెల 31 నుంచి ఈ నెల 3వ తేదీ వరకూ మొదటి విడత కింద 34 మంది రాజధాని ప్రాంత రైతులు సింగపూర్‌లో పర్యటించారన్నారు. 
 
రెండో విడతగా మరో 34 మంది సింగపూర్ వెలుతున్నారన్నారు. సచివాలయం నుంచి బస్సులో బయలుదేరిన రైతులు, హైదరాబాద్ నుంచి విమానంలో సింగపూర్ పయనమవుతారన్నారు. అమరావతిలో ఉన్న రైతులు వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబునాయుడిపై నమ్మకంతో వారంతా తమ భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చారన్నారు. 
 
అంతర్జాతీయ స్థాయి నగరం ఎలా ఉంటుంది... ఎలాంటి అవకాశాలు లభిస్తాయి... అనే వివరాలు ఈ పర్యటనలో రైతులు తెలుసుకుంటారన్నారు. ఒకప్పుడు మత్స్యకార గ్రామమైన సింగపూర్ నేడు ప్రపంచంలో అత్యంత అభివృద్ధి నగరంగా ఎలా రూపొందింది రైతులు ప్రత్యక్షంగా తిలకించనున్నారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా నిర్మించబోతున్న నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై ఈ పర్యటన ద్వారా రైతులకు అవగాహన కలుగుతుందన్నారు. 
 
నాలుగు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రైతులకు సింగపూర్‌లో నివాస, భోజన వసతి సదుపాయలను ప్రభుత్వమే భరిస్తుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రైతులతో పాటు సీఆర్డీఏకు చెందిన ముగ్గురు అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారని మంత్రి వెల్లడించారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సింగపూర్‌ను తలదన్నేలా సీఎం చంద్రబాబు నాయుడు నిర్మిస్తున్న అమరావతి రాజధాని ఎలా ఉండబోతుందో ఈ పర్యటన ద్వారా రైతులకు అవగాహన కలుగుతుందన్నారు.