శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2019 (07:27 IST)

మూడు రాజధానులపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ మూడు రాజధానులపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జీఎన్‌రావు కమిటీ అనంతరం బీసీజీ కమిటీని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేయడానికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ మేరకు ఆదివారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో జగన్ కెబినెట్‌లోని పలువురు మంత్రులు, ముఖ్య అధికారులు ఉన్నారు.
 
కమిటీ సభ్యులు వీరే. ..
బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, పేర్ని నాని, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు, డీజీపీ, ఛీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ, మున్సిపల్ మరియు పట్టణాభివృద్ది కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 

కాగా ఈ హైపవర్ కమిటీకి చీఫ్ సెక్రటరీ.. కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. మూడు వారాల్లోగా కమిటీ నివేదికను ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీ ఆదేశించారు.
 
జనవరి మొదటి వారంలో నివేదిక 
కాగా.. ఇటీవలే కేబినెట్ భేటీలో ఈ మూడు రాజధానుల విషయమై నిశితంగా చర్చించి ఫైనల్‌గా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుందని కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. బీసీజీ నివేదిక జనవరి మొదటి వారంలోనే ప్రభుత్వానికి అందనుంది.