శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 23 ఆగస్టు 2014 (10:53 IST)

బఫూన్ వ్యాఖ్యలపై దుమారం: జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే!

వైకాపా అధినేత జగన్‌ను ఉన్మాది, మాఫియా, స్మగ్లర్, ఫ్రాడ్, నరరూప రాక్షసుడు, కిల్లర్ అన్నారని ఆ పార్టీ నేతలు చెప్పారు. తెలుగుదేశం ప్రజాప్రతినిధులను బఫూన్ అన్న వైకాపా అధినేత వ్యాఖ్యలు శాసనసభను రెండో రోజు కూడా కుదిపేశాయి. 
 
తమను బఫూన్ అన్న జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు వెల్‌లోకి కూడా వెళ్లారు. ఈ క్రమంలో సభ వాయిదా పడింది. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన వైకాపా నేతలు... టీడీపీ ప్రజాప్రతినిధుల ప్రవర్తనను తప్పుబట్టారు. 
 
తమ అధినేతను ఉన్మాది, మాఫియా నాయకుడు, స్మగ్లర్, ఫ్రాడ్, నరరూప రాక్షసుడు, కిల్లర్, క్రిమినల్ అంటూ దారుణ పదజాలంతో కించపరిచేలా మాట్లాడారని ఆరోపించారు. ఈ పదాలన్నీ అన్ పార్లమెంటరీ కాదా అని ప్రశ్నించారు. దీనికి తోడు ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయని, లక్ష కోట్ల ఆస్తులు సంపాదించాడని తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. 
 
టీడీపీ నేతలు ఇంత దారుణంగా మాట్లాడిన తర్వాత... వారిని బఫూన్లు అని జగన్ అనడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. తాము చేసిన వ్యాఖ్యలను కప్పి పుచ్చుకుంటూ... జగన్‌ను కించపరిచేలా మాట్లాడటం ఎంతవరకు సబబన్నారు.