శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (20:54 IST)

'అమరావతి'కి పేరు బలం కుదిరింది... సీఎం చంద్రబాబు, అమరావతి నగర చరిత్ర...

గత కొన్ని రోజులుగా ఆంధ్రుల పురాతన నగరమైన అమరావతి పేరును ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి తిరిగి నామకరణం చేయాలనే చర్చ ప్రారంభమైన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రిమండలి ఏపీ రాజధాని పేరును అమరావతిగా నామకరణం చేసినట్లు బుధవారం మీడియాతో వెల్లడించారు. రాజధానికి వాస్తుతో పాటు పేరు బలం కూడా కుదిరడంతో ఈ నిర్ణయం తీసుకున్నామనీ, అమరావతి పేరును మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు.
 
అమరావతి నగర ఖ్యాతి ఇప్పటిది కాదు...
అమరావతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా గుర్తింపు ఉంది. ప్రపంచ పర్యాటక కేంద్రంగా వర్థిల్లుతున్న ఈ నగరం క్రీస్తుశకం రెండో శతాబ్దంలో ఆంధ్రుల రాజధానిగా భాసిల్లింది. ఈ నగరానికి దక్షిణ కాశి అనే పేరుతోపాటు ధాన్యకటకం అని కూడా పిలుచుకునేవారు. శాతవాహనుల చివరి రాజైన గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి దక్షిణ భారతావనిని పరిపాలించిన సమయంలో అమరావతి శోభాయమానంగా వెలుగొందింది. ఆ తర్వాత 1795లో చింతపల్లి జమీందార్‌ వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ధరణి కోటలో ఉన్న అమరేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. అమరావతికి శాతవాహనుల రాజధానిగానూ ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధారామంగానూ పేరు ప్రఖ్యాతులున్నాయి.
 
అమరావతి అనే పేరు ఎలా వచ్చిందంటే...
 
రాక్షస రాజులయిన హిరణ్యాక్షులు, బలి చక్రవర్తి, నరకాసురుడు, రావణుడు తదితర రాజులను మహా విష్ణువు వివిధ అవతారాలతో సంహరించాడన్నది తెలిసిందే. దీనితో తమ తాతముత్తాతలను మహా విష్ణువు సంహరించాడన్న విషయం తెలుసుకున్న రాక్షస రాజు తారకాసురుడు పరమ శివుని ప్రసన్నం కోసం ఘోర తపస్సు చేస్తాడు. దాంతో శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని అడుగగా... తను ఎవరితోనూ, ఎట్టి ఆయుధముతోనూ, ఎప్పుడూ సంహరించకుండా ఉండేలా చూసే వరం కావాలని కోరుకుంటాడు. శివుడు తథాస్తు అని దీవిస్తూ అతడికి సముద్ర మథనంలో ఉద్భవించిన అమృత లింగాన్ని ఇస్తాడు. ఇచ్చేముందు తారకాసురుడితో శివుడు... ఈ లింగము యథాతథంగా ఉన్నంత వరకు ప్రాణానికి ముప్పు వాటిల్లదని చెప్పి అంతర్థానమవుతాడు. 


 
ఐతే ఆ లింగము తన కంఠంలో ధరించిన తారకాసురుడు ఇక తనకు ఎదురు లేదని దేవతలపై యుద్ధం ప్రకటిస్తాడు. దాంతో దేవతలు తమ సైన్యాధిపతి అయిన కుమారస్వామిని వేడుకుంటారు. అంతట కుమారస్వామి తారకాసురునిపై దాడి చేసి అతడి మెడలో ఉన్న అమృత లింగాన్ని ఛేదిస్తాడు. కుమారస్వామి దెబ్బకు ఆ అమృత లింగము ఐదు ముక్కలయి ఐదు ప్రదేశాల్లో పడుతుంది. వాటిలో పెద్ద ముక్క పడిన ప్రదేశమే నేటి అమరావతి.

స్వర్గ లోకాధిపతి ఇంద్రుడు ఇక్కడ లింగాన్ని ప్రతిష్టించడంతో దానికి అమరారామంగానూ ఆయన రాజధాని అయిన అమరావతిగా ప్రసిద్ధి చెందింది. ఇంతటి పురాణ ప్రాశస్త్యం కలిగిన అమరావతి పేరును ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి నామకరణ చేయడం శుభదాయకమని పండితులు చెపుతున్నారు. ఈ నగరం అంతర్జాతీయంగా కీర్తిని సాధించాలని కోరుకుందాం.