శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2015 (13:20 IST)

కేసీఆర్‌కు అమరావతి శంకుస్థాపన ఇన్విటేషన్ : చంద్రబాబే ఇస్తారా?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అందజేయనున్నారు. వాస్తవానికి ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు ఏవిధంగా అయితే, ఆహ్వాన లేఖలు పంపనున్నారో అదేవిధంగా కేసీఆర్‌కు కూడా ఆహ్వాన పత్రికను పంపాలని తొలుత భావించారు. అయితే, కేసీఆర్, చంద్రబాబు నాయుడులు హైదరాబాద్‌లోనే ఉండటం వల్ల నేరుగా ఇవ్వడమే సముచితమని భావిస్తున్నారు. 
 
కాగా, దసరా పండుగ రోజున నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరుగనున్న అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి లక్ష మందిని ఆహ్వానించాలని ఏపీ సర్కారు భావిస్తోంది. వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రులందరికీ ఆహ్వాన పత్రాలను పంపుతున్నారు. ఈ నేపథ్యంలో  బద్దశత్రవుగా మారిన కేసీఆర్‌కు బాబు ఆహ్వానం పంపుతారా లేదా అనేదే ఇపుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చ జరుగుతోంది. 
 
దీనికి కారణం లేకపోలేదు. గతంలో గవర్నర్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకే ఒకరితో ఒకరు కలవకుండా డుమ్మా కొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు వైఖరి ఎలా ఉండబోతుంది? ఆహ్వానం వస్తే కేసీఆర్ ఎలా స్పందిస్తారనేదానిపైనే సర్వత్రా చర్చ జరిగింది. అందరి సీఎంలతో  పాటు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సైతం ఆహ్వాన పత్రికను పంపాలని భావించినప్పటికీ... చంద్రబాబు మాత్రం స్వయంగా వెళ్లి ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం.