గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2017 (12:42 IST)

2019 ఎన్నికల్లోగా జగన్ జైలుకెళ్లడం ఖాయం: కేఈ కృష్ణమూర్తి జోస్యం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయ్ మాల్యా, లాలూ ప్రసాద్ యాదవ్‌కు మించిన కేసులు జగన్మోహన్ రెడ్డిపై ఉన్నాయన్నారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయ్ మాల్యా, లాలూ ప్రసాద్ యాదవ్‌కు మించిన కేసులు జగన్మోహన్ రెడ్డిపై ఉన్నాయన్నారు. చట్టసభలు, న్యాయ వ్యవస్థపై జగన్‌కు గౌరవం లేదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఓ అరాచకవాదిలా రాష్ట్రంలో గొడవలు సృష్టిస్తున్నారని తెలిపారు. జగన్ చర్యలతో రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతోందని మండిపడ్డారు.
 
2019 ఎన్నికల్లోగా జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని కేఈ కృష్ణమూర్తి జోస్యం చెప్పారు. ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో వాకౌట్ చేయడమే పనిగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి... ప్రస్తుతం ఏకంగా అసెంబ్లీనే బహిష్కరించాలనుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. 
 
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై మంత్రి ఆదినారాయణ తీవ్రంగా మండిపడ్డారు. జగన్ పాదయాత్ర ముగిసేలోపు అక్రమాస్తుల కేసుల్లో అరెస్ట్ కావడం ఖాయమని చెప్పారు. జగన్ పాదయాత్రలు చేస్తే తమకేం అభ్యంతరం లేదని మంత్రి ఆది చెప్పారు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించాలనే నిర్ణయం వెనుక జగన్ కుట్ర ఉందని చెప్పుకొచ్చారు. తన ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే భయంతోనే జగన్ ఈ నిర్ణయానికి వచ్చారని ధ్వజమెత్తారు.