సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 4 జూన్ 2024 (14:10 IST)

వెలవెలబోతున్న తాడేపల్లి ప్యాలెస్ : మరికాసేపట్లో సీఎం జగన్ రాజీనామా!!

ys jagan
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి మరికొన్ని గంటల్లో రాజీనామా చేయనున్నారు. ఇందుకోసం ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. మరోవైపు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం ఉదయం నుంచి వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ సారథ్యంలోని కూటమి సునామీ సృష్టించింది. 
 
ఆ కూటమికి చెందిన పార్టీలు ఏకంగా 155 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళుతున్నాయి. ఇందులో టీడీపీ ఏకంగా 131 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, జనసేన పార్టీ 20, భారతీయ జనతా పార్టీ ఏడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇందులో టీడీపీ మూడు స్థానాలు, బీజేపీ ఒక స్థానాల్లో గెలుపొందినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించాయి. అలాగే 25 లోక్‌సభ స్థానాల్లో కూడా వైకాపా అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయే పరిస్థితి నెలకొంది. ఆ పార్టీకి చెందిన కేవలం నలుగురు మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు. 
 
మరోవైపు, మంగళవారం ఉదయం నుంచి వెలువడుతున్న ఫలితాలతో వైకాపా శ్రేణులు, నేతలు పూర్తిగా డీలా పడిపోయారు. సీఎం జగన్ అధికారిక నివాసమైన తాడేపల్లి ప్యాలెస్‌తో పాటు ఆ పార్టీ ప్రధాన కార్యాలయాలు నిర్మానుష్యంగా ఉన్నాయి. తాడేపల్లి ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఓఎస్డీ మినహా ఒక్కరంటే ఒక్క నేత కూడా కంటికి కనిపించడం లేదు. వైకాపా ప్రధాన కార్యాలయం నిర్మానుష్య వాతావరణం నెలకొంది.