శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2015 (16:58 IST)

అమీర్ చేసిన వ్యాఖ్యలు స్వాతంత్ర్య సమరయోధులను అవమానించేలా ఉన్నాయ్ : అసదుద్దీన్

మత అసహనంపై బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై దేశం వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ముస్లిం సామాజిక వర్గానికి ఎల్లవేళలా అండగా నిలిచే ఎంఐఎం, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్.. ఇపుడు అమీర్ ఖాన్ వ్యాఖ్యలను తప్పుబట్టడం గమనార్హం. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. పైగా, భారతదేశం వీడుతానని అనడం స్వాతంత్ర్య సమరయోధులను అవమానించడమేనన్నారు. భూమండలం ఉన్నంత వరకు భారతదేశం నుంచి తమను ఎవరూ వేరు చేయలేరని అసదుద్దీన్ స్పష్టం చేశారు. తాము భారత్‌ను వీడి వెళ్లాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని ఆయన తెలిపారు. 
 
మరోవైపు.. అమీర్ ఖాన్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ విషయాన్ని ముంబై సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. మత అసహనంపై వెల్లువెత్తున్న విమర్శల నేపథ్యంలో అమీర్‌కు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని భద్రత ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. కాగా, సోమవారం ఢిల్లీలో జరిగిన గొయెంకా ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ, దేశంలో వరుసగా చోటుచేసుకుంటున్న సంఘటనలు తమలో ఆందోళన పెంచుతున్నాయని, తన భార్య దేశం విడిచి వెళ్దామని సలహా కూడా ఇచ్చిందని పేర్కొన్నాడు.
 
పైగా 'ఐదేళ్లు అధికారంలో ఉండండి, ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకోండి' అని రాజకీయ నాయకులకు అధికారం ఇస్తే పరిస్థితులు చక్కబెట్టడం లేదు సరికదా, వివాదాస్పద వ్యాఖ్యలతో సమస్యలను మరింత జటిలం చేస్తున్నారని అమీర్ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అతనికి భద్రత కట్టుదిట్టం చేశారు.