శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : గురువారం, 24 నవంబరు 2016 (15:50 IST)

ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా... ఏపీ సర్కార్ టార్గెట్

రాష్ట్రంలో 2019 నాటికి ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండి, అది వాడుకలో ఉండేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. చాలా కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉన్నా అందులో లావాదేవీలు జరగడంలేదు. బ్యాంకు ఖాత

రాష్ట్రంలో 2019 నాటికి ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండి, అది వాడుకలో ఉండేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. చాలా కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉన్నా అందులో లావాదేవీలు జరగడంలేదు.  బ్యాంకు ఖాతా తెరవడమే కాకుండా, అది చలామణిలో ఉండాలని కూడా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ విజన్-2029లో ప్రభుత్వం పేర్కొంది. రుణాలు, పొదుపు, సబ్బిడీలు, జీవిత బీమా, ప్రమాద బీమా, స్కాలర్ షిప్స్, పెన్షన్, ప్రభుత్వ ఆర్థిక సాయం, రాయితీలు, రైతులకు పంట రుణాలు, డ్వాక్రా గ్రూపు రుణాలు, ఉపాధి హామీ పథకం కింద వేతనాలు, పేదలు ఇతర మార్గాలలో లబ్ధిపొందడానికి బ్యాంకు ఖాతాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలావరకు ఆర్థిక సాయాన్ని బ్యాంకు ఖాతాల ద్వారానే చెల్లిస్తోంది. అయితే బ్యాంకు ఖాతాలు లేక అనేక మంది లబ్దిపొందలేకపోతున్నారు. కొందరికి బ్యాంకు ఖాతాలున్నా వాడుకలోలేవు. అందువల్ల బ్యాంకు ఖాతా ద్వారా పొందే ప్రయోజనాలను ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. 
 
ప్రభుత్వ పథకాలు, రాయితీలు పేదలకు, నిజమైన లబ్ధిదారులకు అందజేయడంలో బ్యాంకు ఖాతాల వల్ల పారదర్శకతకు తావుంటుంది. 2011 జన గణన ప్రకారం దేశంలో ఉన్న ప్రతి 5 కుటుంబాలలో మూడు కుటుంబాలకు  మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. అంటే దేశంలో దాదాపు 40 శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు లేవు. బ్యాంకింగ్ వ్యవస్థకు వారు పూర్తిగా దూరంగా ఉన్నారు. దాంతో ప్రతి కుటుంబం బ్యాంకు ఖాతా కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం దేశంలో 2011-14 మధ్య బ్యాంకు ఖాతాలు 35 శాతం నుంచి 53 శాతానికి పెరిగాయి. ఈ మూడేళ్ల కాలంలో 17.5 కోట్ల మంది కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిచారని ఆ నివేదికలో పేర్కొన్నారు. 
 
దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా లక్ష్యంగా కేంద్రప్రభుత్వం 2014 ఆగస్ట్ 28న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) పథకం ప్రారంభించింది. ఇది మంచి ఫలితాలనిచ్చింది. దేశం మొత్తంమీద అయిదు నెలల్లోనే ఈ పథకం కింద 11.5 కోట్ల మంది బ్యాంకు ఖాతాలను తెరిచారు. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కు ఎక్కింది. ఈ నెల 2వ తేదీ  వరకు దేశంలో ఈ పథకం కింద మొత్తం 25.45 కోట్ల ఖాతాలు తెరిచారు. ఆంధ్రప్రదేశ్ లో 79,10,585 ఖాతాలు తెరిచారు. వాటిలో గ్రామీణ ప్రాంత ఖాతాలు 44,81,387 ఉండగా, పట్టణ ప్రాంత ఖాతాలు 34,29,198 ఉన్నాయి. మొత్తంలో 61,31,892 ఖాతాలకు ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేశారు.
 
పీఎంజేడీవై నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1,18,55,366 కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య కచ్చితంగా తెలియదు. ప్రజాసాధికార సర్వే పూర్తి అయితే తెలుస్తుంది. కొన్ని కుటుంబాలలో ఉన్న సభ్యులందరికీ ఖాతాలు ఉంటున్నాయి. ఒక్కో సభ్యునికి రెండు మూడు ఖాతాలు కూడా ఉంటున్నాయి. ఒక్క ఖాతా కూడా లేని కుటుంబాలు కూడా ఉన్నాయి.  పీఎంజేడీవై పథకానికి ఇటు ప్రజల నుంచి, అటు బ్యాంకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి ఇది తోడ్పడుతుంది. ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందించడంలో జేఏఎం(జన్ ధన్, ఆధార్, మొబైల్) కీలక పాత్ర పోషిస్తుంది. 
 
రాష్ట్ర వ్యాప్త అనుసంధానిత వ్యవస్థ
భవిష్యత్ లో రాష్ట్రం అన్ని  రంగాలలో అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం విజన్-2029 ముసాయిదా పత్రాన్ని రూపొందించింది.   సమ్మిళిత అభివృద్ధికి దోహదపడేవాటిలో అందరికి తప్పనిసరిగా కావలసిన 12 కనీస అవసరాలను ప్రభుత్వం గుర్తించింది. బ్యాంకు ఖాతా ప్రాధాన్యతను గుర్తించి వాటిలో దీనిని కూడా చేర్చింది. సత్వర పారదర్శక పాలనకు ఉపయోగపడే పరివర్తన వ్యూహాలు, మెరుగైన జీవనానికి అవకాశాలలో కూడా దీనిని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను రూపొందించి, వాటిని సమగ్రంగా, సమర్థవంతంగా నిజమైన లబ్ధిదారులకు అందజేయడానికి, పారదర్శకతకు అనువైన ఒక రాష్ట్ర వ్యాప్త అనుసంధానిత వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ-ప్రగతి సాంకేతిక సహకారంతో సమర్థవంతంగా సేవలు అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనికోసం మొదటి దశలో ప్రభుత్వం రూ.2,398 కోట్లు పెట్టుబడి పెడుతుంది. 
 
బ్యాంకు ఖాతాతో ఆధార్ నెంబర్, మొబైల్‌తో సమన్వయం
బ్యాంకు ఖాతాతో ఆధార్ నెంబర్‌ను మొబైల్ నెంబర్‌తో సమన్వయం చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడానికి వీలవుతుంది. నగదు బదిలీ పథకానికి కూడా ఈ ఖాతాలు తప్పనిసరి. అవినీతికి తావులేకుండా ప్రభుత్వ సహాయం నేరుగా లబ్దిదారుని ఖతాలో చేరిపోతుంది. ప్రజాధనానికి భద్రత చేకూరుతుంది. ఈ-ప్రగతిలో భాగంగా బ్యాంకు ఖాతాలను తప్పనిసరి చేశారు. 2019 నాటికి ఆధార్ తో అనుసంధానమైన జన్ ధన్ బ్యాంకు ఖాతాలు వంద శాతం కుటుంబాలు కలిగి ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మారుమూల గ్రామాలలో కూడా జాతీయ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు తమ బ్యాంచ్ లను ప్రారంభించడంతో అందరూ బ్యాంకు ఖాతాలు తెరవడం సులభమైంది. ప్రభుత్వ చర్యలతో ప్రజలలో అవగాహన పెరగడం,  బ్యాంకుల చొరవ వల్ల నిర్ణీత సమయానికంటే ముందుగానే లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది.