శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 4 మే 2015 (13:30 IST)

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు... ప్రయాణికుల పరుగో పరుగు...

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. రైల్వే స్టేషన్‌లో బాంబు పెట్టామంటూ ఓ ఆకతాయి చేసిన ఫోన్‌కాల్ పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించింది. మూడు గంటలపాటు రైల్వే పోలీసులు  తనిఖీ నిర్వహించి ఉత్తిదేనని నిర్ధారించారు. 
 
వివరాలు... రైల్వేస్టేషన్‌లో బాంబు పెట్టామని, అది ఉదయం 11 గంటలకు మూడో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై పేలుతుందని ఉదయం 10 గంటల ప్రాంతంలో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఒక వ్యక్తి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. కంట్రోల్‌రూమ్ అధికారులు అప్రమత్తం చేయడంతో వెంటనే డాగ్ స్క్వాడ్, బాంబ్ స్వ్కాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. 
 
అన్ని ప్లాట్‌ఫారాలు, ప్రయాణికుల లగేజీ, విశ్రాంతి గదులు, పార్కింగ్ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. తీరా తనిఖీలు ముగిశాక అది ఆకతాయి ఫోన్‌కాల్‌గా పోలీసులు నిర్ధారించుకున్నారు. శంకర్‌పల్లికి చెందిన బాలయ్య అనే వ్యక్తికి చెందిన సిమ్‌కార్డు నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టు గుర్తించారు. పోలీసులను ఆటపట్టించిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.