శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (13:35 IST)

పట్టువీడవద్దు.. ప్రత్యేక హోదాపై ప్రశ్నించండి... ఎంపీలకు చంద్రబాబు సూచన

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై పట్టు వీడవద్దని రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. పార్లమెంటులో తమ వాదనను వినిపించాల్సిందేనని ఆదేశించారు. ఎక్కడా ఎట్టి పరిస్థితులలో కూడా పట్టు సడలకుండా వ్యవహరించాలని తెలిపారు. రాష్ట్రంలో ఒకవైపు వైకాపా, మరోవైపు కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేక హోదాపై ఉద్యమాలకు సిద్ధపడుతున్న తరుణంలో దానిపై తమ పార్టీ కూడా  పట్టువీడడానికి వీలులేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
 
శుక్రవారం రాష్ట్రాలకు ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి ప్రకటన చేసిన తరువాత విజయవాడలో మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు దానిపై చర్చ జరిపారు. మంత్రి ప్రకటనలో ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తావన రాలేదు. మనకు ప్రత్యేక హోదా ఇస్తారో, ఇవ్వరో చెప్పకుండా మధ్యస్థంగా ప్రకటించారని, ప్రణాళికా సంఘం మార్గదర్శక సూత్రాల గురించి చెప్పారని అన్నారు. 
 
ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానిది ఒక ప్రత్యేక పరిస్థితి. నిబంధనలతో సంబంధం లేకుండా మనకు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో గతంలోనే నిర్ణయం తీసుకొన్నారు. మనం దాని గురించే అడుగుతున్నాం. అది కావాలని రాష్ట్ర ప్రజలు గట్టిగా కోరుకొంటున్నారు. మనం కేంద్రంతో కలిసి ఉన్నా దీనిని వదిలిపెట్టేది లేదు. దీని సాధనకు మన ప్రయత్నం కొనసాగుతుందని చంద్రబాబు చెప్పారు. ఎంపీలు కూడా అలాగే వ్యవహరించాలని చెప్పారు.