నేను ఎప్పుడో చెప్పాను.. అద్వానీ ఇప్పుడు చెప్పారంతే.. చంద్రబాబు

వాసుదేవన్| Last Updated: శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (15:09 IST)
ఇన్నాళ్లకు మౌనం వీడిన అద్వానీ తన బ్లాగ్‌లో చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే... తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ... ప్రజాస్వామ్య విలువలు తెలియని ఒక వ్యక్తి చేతిలో దేశ భవిష్యత్తు పడిపోయిందన్న విషయాన్ని తాను ఎప్పటి నుంచో చెబుతున్నాననీ, ఇప్పుడు దాన్నే అద్వానీ కాస్తంత సున్నితంగా చెప్పారని పలు ట్వీట్ల రూపంలో వ్యాఖ్యానించారు. 
 
అంతకుముందు "రాజకీయ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ గారు అన్న మాటలు  నరేంద్ర మోడీని ఉద్దేశించి అన్నట్లుగానే ఉంది. మన రాష్ట్రానికి నమ్మక ద్రోహం చెయ్యడమే కాకుండా, కుట్రలతో మనపై దాడులు చేస్తున్న నరేంద్ర మోడీ, తన స్వార్ధం కోసం తన పార్టీని దేశాన్ని కూడా నాశనం చేసే పరిస్థితి ఏర్పడుతోంది" అని, "జాతీయ వాదం అంటే మన వైవిధ్యాలన్నిటినీ కాపాడుకుంటూ, భావప్రకటనా స్వేచ్ఛ కలిగి ఉంటూ, ప్రజాస్వామ్యం వారసత్వ పునాదుల్ని బలపరచటమే కానీ, మనతో విభేదించిన వారిని మన ప్రత్యర్థులను, శత్రువులలాగా చూడటం కాదు... దేశ ద్రోహులుగా ముద్ర వేయడం కాదు" అంటూ ట్వీట్లు పెట్టారు.
 
"దేశమే ముందు. ఆ తర్వాతే పార్టీ. ఆ తర్వాతే వ్యక్తి. వాక్ స్వాతంత్ర్యం, వైవిధ్యం, భిన్నత్వంలో ఏకత్వం, భారతీయ సమాజానికి వారసత్వ మూలాలు. గతం నుంచి నేర్చుకుంటూ, ఆత్మావలోకనం చేసుకుంటూ, భవిష్యత్తు వైపు చూడాలి" అని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు.దీనిపై మరింత చదవండి :