శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (08:49 IST)

పాపం... చంద్రబాబు రాష్ట్రపతికి స్వాగతం పలకలేక... సచివాలయానికే పరిమితం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్తకొత్త అనుభవాలను చవి చూడాల్సి వస్తోంది. ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ విచ్చేశారు. అయినా బాబు వెళ్ళి స్వాగతం పలకలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది. ఆయన విమానం దిగుతున్న ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఉన్నా ఏమి చేయలేకపోయారు. 
 
దక్షిణాది విడిదిలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో విమానం దిగారు. రాష్ట్రపతి వస్తున్నప్పుడు ఆయనకు స్వాగతం పలకడానికి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఆయన త్రివిధ దళాధిపతి కావడంతో సైనిక స్వాగతం ఉంటుంది. ఈసారి కూడా రాష్ట్రపతి విమానం నుంచి దిగగానే సైనికాధికారి సెల్యూట్‌ చేసి స్వాగతం పలికారు. ఆయన పక్కనే ప్రొటోకాల్‌ ప్రకారం గవర్నర్‌ నరసింహన్‌, ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంతి చంద్రశేఖర రావు, ఆయన పక్కనే చీఫ్‌ సెక్రటరీ రాజీవ్‌ శర్మ, ఉప ముఖ్యమంత్రులు మెహమూద్‌ అలీ, కడియం శ్రీహరి వరుసగా నిల్చొని రాష్ట్రపతికి అభివాదం చేసి కరచాలనం చేశారు. 
 
అయితే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏ ఒక్కరూ అక్కడ కనిపించలేదు. రాష్ట్రపతి గత ఆగస్టు 2న నల్సార్‌ వర్సిటీ స్నాతకోత్సవానికి వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయన విమానం దిగినప్పుడు సైనికాధికారి.. గవర్నర్‌.. తెలంగాణ సీఎం.. ఆ తర్వాత చంద్రబాబు నిల్చున్నారు. కానీ ఇప్పుడు అలా పక్కన నిల్చునే అవకాశం కూడా లేకపోయింది. బేగంపేట విమానాశ్రయం రాజధాని ప్రాంతమైన జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉంది. దాంతో తెలంగాణ సీఎంకు తొలి ప్రాధాన్యం ఇస్తే ఏపీ సీఎంకి తదుపరి ప్రాధాన్యం కల్పించారు. 
 
అయితే ఈసారి సీన్‌ మారిపోయింది. బేగంపేట నుంచి బొల్లారం వెళ్లడానికి సికింద్రాబాద్‌ మీదుగా వెళ్లాలి. గంటల తరబడి ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున రాష్ట్రపతి ల్యాండింగ్‌ కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో లేని హకీంపేటలో ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో చంద్రబాబుకు తెలంగాణ సీఎంతో సమానంగా అధికార మర్యాదలు ఉండవని తేలిపోయింది. పొరుగు రాష్ట్ర సీఎం హోదాలో ఆయన స్థానం కిందికి వెళ్లిపోతుంది. నిబంధనల్లో అలాగే ఉన్నందున ఏం చేయలేమని రాష్ట్రపతి భవన్‌ స్పష్టంచేయడంతో స్వాగత కార్యక్రమానికి వెళ్లకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.