శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (11:30 IST)

చంద్రబాబు సింగపూర్ పర్యటనకు.. కేంద్రం ఎందుకు అడ్డుపడినట్లు?

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబు తమ దేశంలో జరిపే పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను సింగపూర్ ప్రభుత్వం ఎప్పుడో ఖరారు చేసింది. అయితే ఉన్నట్టుండి ఆ దేశ ఆధునిక నిర్మాత, ప్రస్తుత ప్రధాని తండ్రి లీకున్ యూ మృతి చెందారు.

ప్రస్తుతం అక్కడ సంతాప కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో అక్కడికి వెళ్లి, వారిని ఇబ్బంది పెట్టడమెందుకని ఆలోచిస్తే, మనం పప్పులో కాలేసినట్లే. పర్యటన సమయం దగ్గరపడగానే అక్కడి నుంచి మన పర్యటనకు సంబంధించి గుర్తు చేస్తూ లేఖలు వస్తాయి.
 
ప్రస్తుతం చంద్రబాబు సర్కారుకు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ఇదివరకు ఖరారైన షెడ్యూల్ ప్రకారమే సింగపూర్ వెళ్లాలని భావించిన చంద్రబాబు, ప్రధాని మోడీ పర్యటనతో వెనక్కు తగ్గక తప్పలేదు. అయితే తమ దేశ నవ నిర్మాత మృతి, సంతాప కార్యక్రమాలను నిర్వహిస్తూనే తన షెడ్యూల్‌ను ఏమాత్రం మార్చుకునేందుకు సింగపూర్ సర్కారు సిద్ధంగా లేదు. ఖరారైన షెడ్యూల్ మేరకే మీరు మా దేశం వస్తున్నారుగా! అంటూ చంద్రబాబుకు ఇటీవలే సింగపూర్ నుంచి లేఖ అందింది. దీంతో కంగుతిన్న చంద్రబాబు సర్కారు, సదరు లేఖకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అయోమయంలో పడిపోయింది.
 
కాగా ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాని నేపథ్యంలో.. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ పర్యటనను ఖరారు చేసుకున్న ఏపీ సర్కారుకు మోడీ ప్రభుత్వం అడ్డు తగలడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు సింగపూర్ టూర్‌కు మోడీ సర్కారు అడ్డువేయడం ద్వారా ఏపీ అభివృద్ధికి బ్రేక్ పడుతుందో ఏమోనని ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సింగపూర్ టూర్ ప్లాన్ ఏమవుతుందో వేచి చూడాలి.