శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (14:10 IST)

ఎన్టీఆర్ పేరు.. తెలంగాణ తీర్మానం అవమానకరమే: చంద్రబాబు

శంషాబాద్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును రద్దు చేయాలని తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానం ఎన్టీఆర్‌ను అవమానపరిచేదేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆంధ్రా నాయకుల పేరు చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని బాబు ఫైర్ అయ్యారు.
 
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుయుక్తులు పన్ని సదరు తీర్మానాన్ని చేశాయని చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా శనివారం ఎన్టీఆర్ ఘాట్ లో పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేపట్టిన దీక్షకు సంఘీభావం ప్రకటించిన సందర్భంగా చంద్రబాబు అసెంబ్లీ తీర్మానంపై మండిపడ్డారు. 
 
ఎన్టీఆర్ ఏ ఒక్క ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదని, దేశ స్థాయిలో చక్రం తిప్పిన వ్యక్తిగా బాబు అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగోడి ఆత్మ గౌరవాన్ని చాటిన ఘనత ఎన్టీఆర్ దేనన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. 
 
కాంగ్రెస్ పార్టీతో రాజీలేని పోరు సాగించిన ఎన్టీఆర్, తెలుగు నేత పీవీ నరసింహారావు ప్రధాని పదవి చేపట్టే సందర్భంగా రాజకీయాలను పక్కనబెట్టి పీవీకి మద్దతు ప్రకటించారన్నారు. సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత జానా రెడ్డి, స్పీకర్ మధుసూదనాచారి తదితర వ్యక్తులందరికీ రాజకీయ భిక్ష పెట్టింది రామారావేనన్నారు.
 
టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ సభలో మాట్లాడుతూ.. ఆపరేషన్ బ్లూస్టార్ అంటున్నారని, మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని చంద్రబాబు ప్రశ్నించారు. బ్లూస్టార్ అపరేషన్ చేస్తే కాంగ్రెస్ కనుమరుగైందని, అక్కడి నుండే ఆ పార్టీ పతనం ప్రారంభమైందని, ఈ రోజు శాశ్వతంగా ఆ పార్టీ లేని పరిస్థితి వచ్చిందన్నారు. అలా చేస్తే ఎవరికైనా అదే గతి పడుతుందని అభిప్రాయపడ్డారు.