శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 29 ఆగస్టు 2014 (11:14 IST)

కాణిపాకం ఆలయంలో రివాల్వర్‌తో చరణ్‌రాజ్.. తేరుకుని సారీ!

చిత్తూరు జిల్లా కాణిపాకంలోని ప్రఖ్యాత వరసిద్ధి వినాయక ఆలయంలోకి నటుడు చరణ్‌రాజ్ రివాల్వర్‌తో ప్రవేశించి వివాదం సృష్టించాడు. దీంతో వినాయక చవితి పర్వదినం రోజైన శుక్రవారం ఆలయంలో భద్రతా ఏర్పాట్లలో ఉన్న డొల్లతనం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. దీనిపై చరణ్ రాజ్ ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. 
 
ప్రముఖ సినీ నటుడు చరణ్ రాజ్ రివాల్వర్‌తో శుక్రవారం ఉదయం ఆలయంలోకి ప్రవేశించాడు. భద్రతా సిబ్బంది సరిగ్గా తనిఖీలు చేయకపోవడంతో పాటు.. భద్రత కోసం ఆలయంలో ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్లు తూతూ మంత్రంగా పని చేయడంతో చరణ్ రాజ్ రివాల్వర్‌తోనే ఆలయం లోపలికి వెళ్లి వినాయకుడిని దర్శనం చేసుకున్నాడు. ఆలయమంతా కలియతిరిగారు. ఆ సమయంలో భక్తులు ఆయన వద్ద తుపాకీ ఉన్న విషయాన్ని గుర్తించి ఆలయ అధికారులకు సమాచారం చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన వద్ద నిశితంగా తనిఖీలు చేయగా, రివాల్వర్ బయటపడింది. 
 
కాణిపాకం ఆలయంలోకి రివాల్వర్ తీసుకురావడం పట్ల చరణ్‌రాజ్ క్షమాపణలు చెప్పారు. తాను తుపాకీని ఉద్దేశపూర్వకంగా తీసుకురాలేదని వివరణ ఇచ్చారు. ఉదయం వినాయక మాల తీసివేసే హడావుడిలో పొరపాటున గన్‌ను పక్కన పెట్టడం మరచిపోయానని చెప్పారు. అంతేకాకుండా.. ఆలయంలోకి తుపాకీ తీసుకెళ్లకూడదన్న విషయం తనకు తెలియదని, ఈ విషయంలో అందరు క్షమించాలని కోరారు. భక్తులకు, ఆలయ సిబ్బందికి, పోలీసులకి ఆయన క్షమాపణలు చెప్పారు. దీంతో ఆలయ అధికారులు చరణ్ రాజ్‌కు తుపాకీని తిరిగి అప్పగించారు.