శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PYR
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (12:36 IST)

అమ్మో.... పులి. చెట్టెక్కిన చిరుత... బంధించే ప్రయత్నాల్లో అటవీశాఖ

ఆంధ్రప్రదేశ్ లోని ఓ గ్రామంలో చిరుత చెట్టికెక్కి కూర్చుంది. తెలంగాణలోని మరో గ్రామంలో ఓ పెద్దపులి జనాన్ని బెంబేలెత్తిస్తోంది. అటవీ శాఖ అధికారులు రెండు చోట్ల ఉరుకులు పరుగుల మీదున్నారు. ఆ రెండింటిని బంధించి జనానికి భయాన్ని పొగొట్టే పనిలో పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
 
శేషాచల పర్వపంక్తిని ఆనుకుని ఉన్న కడప జిల్లా వీరబల్లి మండలం సానిపాయి గ్రామం నేతివారిపల్లె సమీపంలో ఓ చిరుత గత కొద్ది రోజులుగా జనాన్ని ఆందోళన చెందిస్తోంది. దొరికిన జంతువును దొరికినట్లు నోట కరుచుకుపోతోంది. గొర్రె, మేక, కుక్క, పిల్లి ఏది దొరికితే దాన్ని చంపేస్తోంది. ఈ విషయాన్ని గ్రామస్తులు అధికారులకు తెలియజేశారు. అధికారుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. కానీ చిరుత గురువారం ఉదయం గ్రామ సమీపంలో కనిపించింది. అయితే గ్రామస్తులు వెంబడించడంతో ఓ పెద్ద చెట్టెక్కి కూర్చుంది. 
 
దీంతో అధికారులు ఆ గ్రామానికి పరుగులు పెట్టారు. మత్తు మందులు వేసే తుపాకులు, బోనులు చేతబట్టుకుని తిరుపతి నుంచి వీరబల్లికి పరుగులు పెడుతున్నారు. అక్కడకు చేరుకున్నా అటవీ సిబ్బంది ఏ విధంగా చిరుతను చెట్టు దించాలా..! అని ఆలోచిస్తున్నారు. దగ్గరికెళ్లే అవకాశం లేకపోవడంతో బోను ద్వారా చిరుతను బంధించాలని అనుకుంటున్నారు. 
 
మరోవైపు అదిలాబాద్ జిల్లా కౌటాల గ్రామ సమీపంలో పెద్ద పులి ఒకటి హల్ చల్ సృష్టిస్తోంది. ఆ ప్రాంతాలలో తిరగాలంటేనే సమీప గ్రామాలలోని జనం బెంబేలెత్తుతున్నారు. ఇక్కడ అటవీ అధికారులు వలలు, బోనుల చేత పట్టుకుని పులిని వేటాడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.