శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2016 (15:14 IST)

రామ్ గోపాల్ వర్మకు పిచ్చిపట్టి నోటికొచ్చినట్టల్లా వాగుతున్నాడు: కాంగ్ నేతలు

తనకు ఏది నచ్చితే అది చేస్తూ.. తనకు నచ్చిన అంశంపై సినిమా తీసుకుంటూ పోతానని.. ఇష్టం ఉంటే చూడండి.. నచ్చకపోతే చూడకండని వ్యాఖ్యానిస్తున్న ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై విశాఖపట్నం కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. రామ్ గోపాల్ వర్మని పిచ్చాసుపత్రిలో చేర్చుకోవాలని మెంటల్ హాస్పిటల్ సూపరిండెంట్‌కు వినతిపత్రం ఇచ్చారు. 
 
తనకు ఏది నచ్చితే అది, ఎలా పడితే అలా మాట్లాడేసే రామ్ గోపాల్ వర్మ వంగవీటి సినిమా తీస్తున్నానని తెలిపాడు. అంతటితో ఆగకుండా తన సినిమాలో కులాల ప్రస్తావన వచ్చేలా ఓ పాటను కూడా విడుదల చేశాడు. దీంతో విజయవాడలో కులాల కుమ్ములాటలు మొదలయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఎవరేం చెప్పినా తన పని తాను చేసుకుంటూ పోతున్న రామ్ గోపాల్ వర్మకు మతి చలించిందని విశాఖ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అంతేగాకుండా వైజాగ్‌లోని పిచ్చాసుపత్రి సూపరిండెంట్‌కి వినతి పత్రం ఇచ్చారు. అందులో వర్మకు పిచ్చిపట్టి నోటికొచ్చినట్టల్లా వాగుతున్నాడని, మీ ఆసుపత్రిలో చేర్చుకుని అతనికి సరైన చికిత్స ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.