శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (15:43 IST)

ఏపీలో భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు : సర్కారు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారు. ఈ మేరకు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సవరిస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో కొన్ని రిజిస్ట్రేషన్లలో తగ్గించిన రుసుంను మళ్లీ పెంచుతూ ఉత్తర్వులు వచ్చాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు కొద్ది రోజులుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు, మద్యం అమ్మకాల రుసుంను పెంచాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. 
 
ఇందులో భాగంగా ముందుగా రిజిస్ట్రేషన్ల రుసుంను పెంచారు. కుటుంబ సభ్యుల మధ్య రిజిస్ట్రేషన్‌ల మార్పులో గతంలో 30 శాతంగా ఉన్న రిజిస్ట్రేషన్ రుసుంను గత ఏడాది నవంబర్‌లో ఒక శాతానికి తగ్గించారు. తాజాగా సవరించిన ఉత్తర్వుల్లో ఈ రుసుంను రెండు శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇతర కేసుల్లో రిజిస్ట్రేషన్ ఒప్పందాలకు సంబంధించి గత నవంబర్‌లో జారీచేసిన ఉత్తర్వుల్లో మార్కెట్ విలువపై రెండు శాతంగా ఉన్న రుసుంను ఇప్పుడు మూడు శాతానికి పెంచారు. 
 
కుటుంబ సభ్యులకు బహుమతి రిజిస్ట్రేషన్లలో గతంలో ఉన్న ఒక శాతం రుసుంను ఇప్పుడు రెండు శాతానికి, ఇతరులకు ఇచ్చే బహుమతి రిజిస్ట్రేషన్ల రుసుంను నాలుగు శాతం నుంచి ఐదు శాతానికి పెంచారు. ఇక ఒకే కుటుంబంలో ఆస్తిని విభజన చేసే రిజిస్ట్రేషన్ల ఛార్జీలను 0.5 శాతం నుంచి ఒక శాతానికి, ఇతరులకు ఆస్తి పంచి ఇచ్చే సమయంలో చేసే రిజిస్ట్రేషన్లలో రుసుంను ఒక శాతం నుంచి రెండు శాతానికి పెంచుతూ తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.