శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 26 ఆగస్టు 2014 (09:09 IST)

గవర్నర్ వస్తే మాకేంటి: గంటలు గంటలు క్యూలైన్‌ ఆపేస్తారా?

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తుల ఆగ్రహోద్రుక్తులయ్యారు. రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ రాక సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. నరసింహన్ దంపతులు సోమవారం తిరుమల వేంకటేశ్వరుని సేవలో పాల్గొన్నారు. అక్కడ నుంచి తిరుచానూరు పద్మాపతి అమ్మవారి ఆలయానికి వచ్చారు. 
 
గవర్నర్‌ దర్శనం కోసం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో క్యూలైన్‌ను గంటన్నరపాటు నిలిపివేయడంతో భక్తులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అదీ.. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో ఆపివేయడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘గవర్నర్‌ వస్తే మాకేంటి? ఆయనా ప్రజా సేవకుడే. గంటలు గంటలు క్యూలైన్‌ ఆపేస్తే ఎలా?’ అంటూ వారు మండిపడ్డారు. 
 
సరిగ్గా భోజన సమయంలో ఇలా చేయడం ధర్మమా అంటూ ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు. ‘గవర్నర్‌ కూడా ప్రజా సేవకుడే. ఆయన వచ్చారని ఆపితే మేము దర్శనం ముగించుకుని మళ్లీ ట్రైన్‌కు వెళ్లేదెలా?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువసేపు క్యూలైన్లు నిలిచిపోవడంతో చంటిపిల్లలు ఏడుపులు మొదలుపెట్టారు. ఈ సమయంలో భక్తులకు సర్దిచెప్పాల్సిన ఒక పోలీసు అధికారి వారితో బెదిరింపు ధోరణిలో మాట్లాడటంతో భక్తులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాధికారుల, పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు.