శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (13:54 IST)

డ్వాక్రా రుణం తీసుకుంటున్నారా... ఎక్కడంటే అక్కడ సంతకాలు పెడితే...

ఆ.. రుణాలు తమ పేరిట ఉన్నట్లు వారికస్సలు తెలియదు. బ్యాంకు అధికారి కదా అని ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేశారు. ఆ పాపానికి వారి పేరిట మరో అప్పు వెలిసింది. ఏంటిదని తెలుసుకునే లోపు సంతకాలు చేయించుకున్న అధికారి అక్కడ నుంచి బదిలీ అయిపోయాడు. వీరేమో బ్యాంకుకు బుక్కయ్యారు. డ్వాక్రా మహిళలను మోసం చేసిన ఘరానా బ్యాంకు సిబ్బంది సంఘటన ఇది.
 
చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండల కేంద్రంలో ఓ జాతీయ బ్యాంకు ఉంది. ఇందులో పలువురు డ్వాక్రా సంఘాల మహిళలు రుణం తీసుకుంటుంటారు. తిరిగి చెల్లిస్తుంటారు. ఈ క్రమంలోనే భాగంగా బుచ్చినాయుడు కండ్రిగ మండలం కల్లివెట్టు గ్రామానికి చెందిన వినాయక, సాయి, బాలాజీ స్వయం సహాయక సంఘ సభ్యులు రుణం తీసుకున్నారు. వినాయక సంఘ సభ్యులు గత ఏడాది నవంబరు 13న రూ.3.60 లక్షలు, సాయి సంఘ సభ్యులు గత యేడాది జూన్‌ 20న రూ.5 లక్షలు, బాలాజీ వికలాంగ స్వయం సహాయక సంఘ సభ్యులు 2012 అక్టోబర్‌ 13న రూ.3లక్షల రుణం తీసుకున్నారు. 
 
రుణాన్ని క్రమం తప్పకుండా కంతుల వారీగా చెల్లిస్తున్నారు. ఇవన్నీ తీరిపోతున్నాయనీ, చంద్రబాబు ఏమైనా రుణాన్ని రద్దు చేస్తే తమకు లబ్ధి చేకూరుతుందనుకుంటున్న సమయంలో సదరు బ్యాంకు అధికారి ఒకరు బాంబు పేల్చారు. ఫలానా తేదిలో ఫలానా ఖాతా కింద రూ. 11.5 లక్షల సొమ్ము రుణంగా తీసుకున్నారు. అది ఇంతవరకూ కట్టనే లేదు. కారణమేంటంటూ ప్రశ్నించేసరికి డ్వాక్రా సంఘాల సభ్యులకు దిమ్మ తిరిగి పోయింది. లబోదిబోమంటూ తమకు తెలిసిన నాయకులను పట్టుకుని బ్యాంకు వద్దకు పరుగులు పెట్టారు. విషయమేందో తెలుసుకుందామని అధికారులు లోతుకెళ్ళి పరిశీలిస్తే, ఇదిగో ఇలా జరిగి ఉంటుందని తేల్చారు. 
 
అయితే వీరికి తెలియకుండానే ఆ బ్యాంకులో పనిచేసే ఓ ఉద్యోగి ఈ సంఘాల పేరిట రుణం తీసుకున్నారు. అసలు రుణం తీసుకునేందుకు వచ్చిన సమయంలోనే అదనంగా సంతకాలు చేయించుకుని వారి పేరిట కొత్త ఖాతాలను తెరిచారు. వినాయక సంఘ సభ్యుల పేరిట ఖాతా నంబరు. 33215500421 ప్రారంభించారు. ఈ ఖాతా నుంచి 2013 ఆగస్టు 16న రూ.3.60లక్షలు నొక్కేశారు. ఇక సాయి సంఘ సభ్యుల పేరిట ఖాతా నెంబరు.33082405087 ప్రారంభించి 2013 జూన్‌ 26న రూ.3.90లక్షలు రుణం బొక్కేశారు. అదేవిధంగా బాలాజీ వికలాంగ సంఘ సభ్యుల పేరున నూతన ఖాతా నెం.33527155099 ప్రారంభించారు. ఈ ఖాతా నుంచి 2013 డిసెంబర్‌ 19న రూ.4లక్షలు రుణం తీసుకుని మింగేశారు. అయితే ఈ అధికారి తాను ఉన్నంత కాలం కంతులు రాకపోయినా బయట పడకుండా చూడగలిగారు. అయితే ఆయన ఇటీవలే బ్యాంకు నుంచి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మరో ఉద్యోగి ఈ బ్యాంకు విధుల్లో చేరారు. 
 
ఇటీవల జరుగుతున్న రుణమాఫీల కారణంగా ఎవరెవరు ఎంతెంత బకాయి ఉన్నారో చూద్దామని ఆయన రుణాల వివరాలను పరిశీలిస్తుండగా ఈ మూడు సంఘాలు రుణం తీసుకుని పైసా కూడా చెల్లించకుండా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ సంఘ సభ్యులను కలసి రుణం చ్లెలంచాలని సూచించాడు. తాము తీసుకున్న రుణాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఈ అప్పు గురించి తమకేమీ తెలియదని చెప్పారు. ఖాతా ఎలా వచ్చిందని ప్రశ్నించడంతో తమ వద్ద అదనంగా సంతకాలు చేయించుకున్న విషయం తమకు తెలియదని వాపోయారు. ఈ సంఘ సభ్యుల పేరుతో ఇతరులు రుణం తీసుకున్నట్లు గుర్తించారు. ఇదే బ్యాంకులో పనిచేస్తూ ఇటీవల బదిలీ అయిన ఓ ఉద్యోగి ఈ సొమ్మును స్వాహా చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. విషయాన్ని బ్యాంకు అధికారులు ఉన్నతాధికారులకు చేరవేశారు. కాబట్టి డ్వాక్రా రుణాలే కదా అని ఎక్కడపడితే అక్కడ సంతకాలు చేసేస్తే ఇలాగే ఇరుక్కుపోతారు జాగ్రత్త అంటున్నారు.