గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 6 మార్చి 2018 (20:17 IST)

దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫీడర్ అంబులెన్సులు... జెండా ఊపి ప్రారంభించిన చంద్రబాబు

అమరావతి: మారుమూల గిరిజన ప్రాంతవాసుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ద్విచక్ర వాహనాలతో కూడిన 122 ఫీడర్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ద్వారా రోడ్డు సౌకర్యం లేని, 108 వాహనాలు చేరుకోలేని ప్రాంతాలకు వెళ్లి, రోగులను సమీప

అమరావతి: మారుమూల గిరిజన ప్రాంతవాసుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ద్విచక్ర వాహనాలతో కూడిన 122 ఫీడర్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ద్వారా రోడ్డు సౌకర్యం లేని, 108 వాహనాలు చేరుకోలేని ప్రాంతాలకు వెళ్లి, రోగులను సమీప ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి అవకాశం కలుగుతుంది. సచివాలయంలోని ఒకటో నెంబర్ బ్లాక్‌లో ఫీడర్ అంబులెన్స్‌లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫీడర్ అంబులెన్స్‌ల పనితీరును సీఎ చంద్రబాబునాయుడుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వివరించారు.

అనంతరం మంత్రి కామినేని శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ, దేశంలోనే మొట్టమొదటిసారిగా మన్య ప్రాంతవాసుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఫీడర్ అంబులెన్సులను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ప్రయోగాత్మకంగా పీపీపీ పద్ధతిలో 122 ఫీడర్ అంబులెన్స్ సేవలను వినియోగిస్తున్నామన్నారు. ఒక్కో వాహనం వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం రోజుకు రూ.2,100 వినియోగించనుందని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.
 
రోగి పడుకునే విధంగా ఏర్పాట్లు...
ప్రతి ఐటీడీపీ పరిధిలో ఉన్న రెండు మూడు 108 అంబులెన్స్ లకు ఒక్కో ఫీడర్ అంబులెన్స్ వాహనం అందుబాటులో ఉంచుతామని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ వాహన సేవలు అందుబాటులోకి రావడం ద్వారా మన్య ప్రాంతంలో ఉన్న గర్భిణులకు, పలు ప్రాణాంతక వ్యాధుల భారినపడిన రోగులకు, ప్రమాదాలకు గురైన వారికి ఎంతో లబ్ధి కలుగుతుందన్నారు. రోగిని వాహనంలో పడుకునే విధంగా బెడ్ సౌకర్యం కల్పించడంతో పాటు ఆక్సిజన్ సిలిండర్‌ను కూడా అందులో అమర్చామన్నారు. 12 రకాల వైద్య పరికరాలు, అత్యవసర మందులు కూడా వాటిలో ఏర్పాటు చేశామన్నారు. ఫీడర్ అంబులెన్స్ సేవలు విజయవంతమైతే, మిగిలిన అన్ని ప్రాంతల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఏజెన్సీలో మారుమూల ప్రాంతాలు, రోడ్డు సౌకర్యంలేని గ్రామాలకు ఫీడర్ అంబులెన్స్‌లు సులభంగా చేరుకోగలవన్నారు.
 
ఐటీడీఏలకు వాహన కేటాయింపులు ఇలా...  
108 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫోన్ చేసిన 60 నిమిషాల్లో సంఘటనా స్థలానికి ఫీడర్ అంబులెన్స్ చేరుకుంటుందని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ అంబులెన్స్ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్రంలో ఉన్న ఏడు ఐటీడీలకు 122 పీడర్ అంబులెన్స్‌లు కేటాయించామని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. సీతంపేట ఐటీడీఏకు 15, పార్వతీపురం ఐటీడీఏకు 24, పాడేరు ఐటీడీఏకు 42, రంపచోడవరం 21, చింటూరు 6, కె.ఆర్.పురం 8, శ్రీశైలం ఐటీడీఏకు 6 ఫీడర్ అంబులెన్స్‌లు కేటాయించామన్నారు.
 
సీఎం చంద్రబాబునాయుడును కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి మంగళవారం ఏపీ అసెంబ్లీ హాల్‌లో కలిశారని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య పథకాలను అడిగి తెలుసుకున్నారన్నారు. ఆ పథకాలను కేంద్ర స్థాయిలో అమలు చేయడానికి ఆసక్తి చూపారన్నారు. గుంటూరులోని ఆనందపేటలో అతిసార ప్రబలడంపై మంత్రి కామినేని శ్రీనివాస్ స్సందిస్తూ, నీటి కలుషితం వల్లే ఈ అంటువ్యాధి పలువురికి సోకిందన్నారు. బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. బాధిత ప్రాంతంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేస్తూ బాధితులను గుర్తిస్తున్నామన్నారు.