శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 24 జులై 2014 (12:02 IST)

గవర్నర్ ఇఫ్తార్ విందుకి చంద్రబాబు హాజరు - కేసీఆర్ డుమ్మా!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్. నరసింహన్ బుధవారం సాయంత్రం తన కార్యాలయమైన రాజ్‌‌భవన్‌లో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు జగన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లను గవర్నర్ ఆహ్వానించారు. 
 
అయితే, గవర్నర్ ఆహ్వానాన్ని గౌరవిస్తూ చంద్రబాబు, జగన్ విందుకు హాజరుకాగా, కేసీఆర్ మాత్రం పనుల ఒత్తిడిలో ఉన్నానంటూ ఇఫ్తార్ విందుకు డుమ్మా కొట్టారు. ఈ సందర్భంగా ఒకరికొకరు ఎదురైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరస్పరం నమస్కారం చేసుకున్నారు. ఇఫ్తార్ విందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, ఇతర పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. 
 
కాగా, ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు, తెలంగాణ మంత్రులు, ఇతర పార్టీల నేతలంతా సరదా సరదాగా కలిసిపోయారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చలోక్తులు విసురుతూ, సందడి చేశారు. చంద్రబాబు గవర్నర్‌ పక్కన ఉన్నప్పుడు... తెలంగాణ మంత్రులు నాయిని నరసింహారెడ్డి, ఈటెల రాజేందర్‌, శాసనమండలి అధ్యక్షుడు స్వామిగౌడ్‌ దూరంగా నిలబడ్డారు. వారిని చూసి... ‘అంత దూరంగా ఉన్నారేం! రండి. నా దగ్గరకు వస్తే ఎవరూ ఎమీ అనుకోరు. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు’ అని చంద్రబాబు అన్నప్పుడు మంత్రులు మొహమాటంగా నవ్వుతూ ఆయన వద్దకు వచ్చి కరచాలనం చేశారు. 
 
ఈ విందుకు గవర్నర్‌ ఇరు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించినా... కేసీఆర్‌ హాజరు కాలేదు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, ‘‘మీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా వస్తే బాగుండేది. దేనికదే! కలిసేచోట కలవాలి. తప్పేం కాదుగా’ అని చంద్రబాబు టీఆర్‌ఎస్‌ నేతలతో అన్నారు. దీనిపై మంత్రులు ఏమీ స్పందించలేదు. నాయిని గతంలో తమతోనే ఉండేవారని, ఇప్పుడు దూరమయ్యారని... దగ్గరకు కూడా రావడం లేదని చంద్రబాబు సరదాగా అన్నారు.