మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (11:10 IST)

గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని బలి.. నిందితుడి అరెస్ట్..

గుంటూరులో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలైపోయింది. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమెపై ప్రేమోన్మాది కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశాడు. ఓ పక్క వాడవాడలా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటున్న సమయంలోనే ఈ దారుణం జరగడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన నల్లపు వెంకటరావు కుమార్తె రమ్య (19) గుంటూరు సమీపంలోని సెయింట్‌ మేరీస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. 
 
నెలరోజుల క్రితం పరీక్షలు రాసేందుకు పెదకాకాని రోడ్డు పరమయ్యకుంటలోని నాయనమ్మ ఇంటికి వచ్చి అక్కడే ఉంటోంది. ఆమెకు వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన శశికృష్ణతో పరిచయం ఏర్పడింది. అతను ప్రేమిస్తున్నానంటూ రమ్య వెంటపడేవాడు. ఆదివారం ఉదయం రమ్య బయటకు వెళ్లి నాయనమ్మకు టిఫిన్‌ తీసుకొచ్చింది. కొద్దిసేపటికే శశికృష్ణ ఫోన్‌ చేయగా ఇప్పుడే వస్తానని నాయనమ్మతో చెప్పి బయలుదేరింది. 
 
రోడ్డుపైకి వచ్చిన రమ్య శశికృష్ణ బండి ఎక్కి రోడ్డు దాటి ముందుకు వెళ్లింది. ఇంతలో అక్కడ ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో రమ్య బైకు దిగిపోయి రోడ్డు ఇవతలి పక్కకు వచ్చేసింది. శశికృష్ణ వెంటనే బైకు తిప్పి వచ్చి రమ్యను చేత్తో రెండు దెబ్బలు కొట్టాడు. కింద పడిన ఆమెను తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా ఆరు పోట్లు పొడిచాడు. జనం గుమిగూడటంతో నిందితుడు అక్కడి నుంచి పరారై, తన సెల్‌ఫోన్‌ను స్విచాఫ్‌ చేశాడు. 
 
బాధితురాలిని 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, కొన్ని నిమిషాలకే తుదిశ్వాస విడిచింది. తండ్రి వెంకటరావు, ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకొని గుండెలు బాదుకుంటూ విలపించారు. మృతదేహంపై పడి కన్నీరుమున్నీరుగా రోదించారు. నిందితుడు శశికృష్ణను పోలీసులు పట్టుకున్నారు. రమ్య హత్యపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దిశ చట్టం కింద వేగంగా చర్యలు తీసుకుని దోషులకు కఠిన శిక్ష పడేలా చేయాలని ఆదేశించారు. 
 
ఇలాంటి ఘటనలకు పాల్పడే నిందితులకు ఉరిశిక్షే సబబని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నా రు. జీజీహెచ్‌లో రమ్య మృతదేహాన్ని ఆమె పరిశీలించా రు. కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలను ఇంత దారుణంగా హత్య చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.