కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీలోని సొంతూళ్లకు ప్రజలు భారీగా తరలివెళ్తున్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వడంతో ఏపీ వైపు వెళ్లే వాహనాలతో రోడ్లు రద్దీగా మారాయి.
అయితే... ఇలా వెళ్లే వారికి ఊహించని చిక్కులు ఎదురవుతున్నాయి. జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్ దగ్గర వాహనాలను నిలిపివేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సాయంత్రం 4 గంటల నుంచి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
రామాపురం క్రాస్ నుంచి ఏపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో.. రామాపురం క్రాస్, బుదవాడ గ్రామాల దగ్గర స్థానికులు కంచె వేశారు. తమ గ్రామాల నుంచి వెళ్లొద్దంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణ వైపు వెళ్లేందుకు బయల్దేరిన నిత్యావసర వాహనాలు గరికపాడు చెక్‌పోస్ట్ దగ్గర నిలిచిపోయాయి. దీంతో.. ఏపీ వైపు వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
కరోనా వైరస్ ప్రభావంతో అధికారులు హైదరాబాద్‌లో భారీ భద్రతతో పాటు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో నగరంలోని హాస్టల్ యజమానులు విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. అమీర్ పేట, పంజాగుట్ట, మాదాపూర్, బాలనగర్ తో పాటు పలు ఏరియాల్లో హాస్టల్స్ నుంచి విద్యార్థులను పంపిచేస్తున్నారు.
దీంతో మేము ఎక్కడికి వెళ్లాలని ఆందోళనకు దిగిన విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు. తమ సమస్యను పరిష్కరించాలని పోలీసులను వేడుకున్నారు. విద్యార్థుల ఆందోళనపై డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. హైదరాబాద్ నుంచి ఊర్లకు వెళ్లేందుకు విద్యార్థులకు అనుమతి ఇచ్చారు. సొంత వాహనాలు ఉంటేనే అనుమతి ఇస్తామని డీజీపీ తెలిపారు.
అత్యవసరమైతే స్థానిక పోలీసులు అనుమతి ఇస్తారని చెప్పారు. ఉద్యోగులకు కంపెనీలే వాహనాలు ఏర్పాటు చేయాలని
డీజీపీ సూచించారు. ఎలాంటి ఆటంకం లేకుండా స్వగ్రామలకు వెళ్లేలా పోలీసులు పాసులు మంజూరు చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో చెక్‌పోస్ట్‌ల వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా విద్యార్థులు తమ తమ స్వస్థలాలకు వెళ్లేలా పాసులు మంజూరు చేశామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
హైదరాబాద్‌లో కరోనా తీవ్రత, 21 రోజుల లాక్‌డౌన్ నేపథ్యంలో ఉన్నట్టుండి చాలా హాస్టళ్లను మూసివేశారు. ‘మీదారి మీరు చూసుకోండి’ అని బయటికి పంపించేశారు. దీంతో... హాస్టళ్లలో ఉన్న వారంతా తమ ఇళ్లకు వెళ్లిపోవడానికి అనుమతించాలని హైదరాబాద్ పోలీసులను కోరారు.
ఠాణాల ముందు గంటలకొద్దీ క్యూలలో నిల్చుని క్లియరెన్స్ సర్టిఫికెట్లు పొందారు. ‘అంతా ఓకే కదా’ అనుకుని సొంత కార్లు, ద్విచక్ర వాహనాలలో ఏపీలోని తమ స్వగ్రామాలకు బయలుదేరారు. నిజానికి... లాక్‌డౌన్‌కు ముందు నుంచే రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటూ వాహనాలను అనుమతించడంలేదు.
రెండు రాష్ట్రాల పోలీసులు అటూ ఇటూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కానీ, బుధవారం వాహనాలు ఒక్కొక్కటిగా తెలంగాణ చెక్‌పోస్టులు దాటి ఏపీలోకి ప్రవేశించాయి. ‘ఎందుకొచ్చారు? ఎలా వచ్చారు?’ అని ప్రశ్నించగా... తెలంగాణ పోలీసులు ఇచ్చిన క్లియరెన్స్ సర్టిఫికెట్లు చూపించారు. దీంతో అక్కడున్న పోలీసులు అయోమయానికి గురయ్యారు.
ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా ఏపీలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. కొందరు తెలంగాణలోని మెడికల్ సెంటర్లలో పరీక్షలు చేయించుకుని, కరోనా లక్షణాలు లేవని అప్పటికప్పుడు ధ్రువీకరణ పత్రం పొందినప్పటికీ ససేమిరా అన్నారు.
చూస్తుండగానే 1500 నుంచి 2 వేల మంది కార్లు, బైక్‌లలో చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం, ఉత్కంఠ నెలకొన్నాయి. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఈ సమస్యను జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వారిని అనుమతించడంపై ఏపీ అధికారులు తీవ్ర తర్జనభర్జనలు పడ్డారు.
పోనీలే పాపం అని వదిలేద్దామంటే... వారిలో ఎవరికి కరోనా పాజిటివ్ ఉన్నా పెద్ద ‘రిస్క్’ చేసినట్లవుతుంది. చివరికి... ఇలాంటి సమయంలో రిస్క్ తీసుకోలేమని, పూర్తిస్థాయిలో స్ర్కీనింగ్ పరీక్షలు చేసిన తర్వాతగానీ ఏపీలోకి అనుమతించరాదని నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణించిన వారిని వెనక్కి పంపించలేక, అలాగని నేరుగా ఇళ్లకూ పంపించలేక మార్గాంతరం అన్వేషించారు.
చివరికి కృష్ణా, గుంటూరు జిల్లాలవారిని బస్సుల్లో నూజివీడు ట్రిపుల్ ఐటీకి తరలించారు. తూర్పుగోదావరి జిల్లావారిని రాజమండ్రిలో క్వారంటైన్‌కు పంపించారు. పశ్చిమగోదావరి జిల్లావారిని తాడేపల్లిగూడం, పాలకొల్లు, భీమవరం క్వారంటైన్ కేంద్రాలకు పంపించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి, ఫలితాల ఆధారంగా స్వస్థలాలకు పంపాలని నిర్ణయించారు.
సాయం చేయండి: కేటీఆర్‌కు ట్వీట్లు
ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌కు వినతులు వెల్లువెత్తున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలెదుర్కొంటోన్న ఇబ్బందులు పరిష్కరించాలని మంత్రిని కోరుతున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. సాయం చేయండి అంటూ ట్విట్టర్ వేదికగా అభ్యర్థిస్తున్నారు.
భువనగిరిలో నివాసం ఉంటోన్న ఓ వ్యక్తి తన తండ్రికి డయాలసిస్ కొరకు నిమ్స్, ఈఎస్ఐకు తీసుకెళ్లాలని.. ప్రజారవాణా అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. డయల్ 100, డయల్ 108 కు కాల్ చేసినా ఎవరూ స్పందించడం లేదని, ప్రైవేటు వాహనాలేమీ అందుబాటులో లేవని వాపోయారు.
స్పందించిన కేటీఆర్ సాయమందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు లాక్ డౌన్ కారణంగా రామంతపూర్ హాస్టల్లోనే దివ్యాంగురాలైన తన చెల్లి ఉండిపోయిందని.. హాస్టల్ నిర్వాహకులు తిండి పెట్టకుండా ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని కేటీఆర్ దృష్టికి తీసుకురాగా.. ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేటీఆర్ ఆఫీసు త్వరలో మీ అభ్యర్థనలను పరిష్కరిస్తుందని పౌరులకు అభయమిచ్చారు.
సీఎం నుంచి స్పష్టమైన ఆదేశాలు
పోలీసులకు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఇప్పుడు అక్కడ స్పాట్ లో ఉన్న వారందరినీ ఏపీలో కి అనుమతిస్తున్నారు. అయితే మెడికల్ ప్రోటోకాల్ పాటించి మాత్రమే. కొత్తగా ఎవర్ని అనుమతించరు. ఈరోజు అక్కడ ఉన్న వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.