శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 18 ఆగస్టు 2014 (17:01 IST)

తెలంగాణలో కుటుంబ సర్వేకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్!

తెలంగాణలో కుటుంబ సర్వేకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికిప్పుడే సర్వేను ఆపలేమని కోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ మంగళవారంనాడు జరప తలపెట్టిన సమగ్ర సర్వేకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. 
 
సర్వే చట్ట విరుద్ధమంటూ సుప్రీం కోర్టు న్యాయవాది పీవీ కృష్ణయ్య దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే సర్వేకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు పూర్తి వివరాలు ఇచ్చిందని, సమగ్ర సర్వే నిర్వహిస్తున్నది కేవలం లబ్దిదారులను గుర్తించేందుకేనని ప్రభుత్వం కోర్టుకు స్పష్టం చేసింది. 
 
ఈ నేపథ్యంలో న్యాయవాది పీవీ కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు తుది తీర్పును వెలువడించింది. ఈ సర్వేపై ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన స్పష్టమైన వివరణతో కోర్టు ఏకీభవించింది. ఇప్పటికిప్పుడే సర్వేను ఆపలేమని కోర్టు తేల్చిచెప్పింది. 
 
అలాగే ఈ కేసుకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు పెద్ద యెత్తున సమగ్ర కుటుంబ సర్వేను తలపెట్టింది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.