శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 1 జులై 2015 (09:28 IST)

సెక్షన్ 8 ముగిసిన అధ్యాయం : కేంద్ర హోంశాఖ స్పష్టీకరణ

హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం విభజన చట్టంలో రూపొందించిన సెక్షన్ 8 అంశం ఇపుడు ముగిసిన అధ్యాయమని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది. 
 
గత ఏడాది జూన్‌ 4వ తేదీన సెక్షన్‌ 8 అమలుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో గవర్నర్‌కు అధికారాలు కట్టబెడుతూ తెలంగాణ బిజినెస్‌ రూల్స్‌లో మార్పులు చేయాలని ఈ లేఖలో సూచించింది. అయితే... ఈ లేఖను ఉపసంహరించుకోవాలని గత ఏడాది జూన్‌ 27వ తేదీన రాజ్యసభలో పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కోరారు. 
 
దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఈ నెల 16వ తేదీన సమాధానమిస్తూ పాల్వాయికి లేఖ రాశారు. ‘కేంద్రం రాసిన లేఖకు తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. రాజ్యాంగం, పునర్విభజన చట్టం ప్రకారం శాంతి భద్రతల బాధ్యతను నిర్వర్తిస్తామని హామీఇచ్చింది. దీంతో ఈ అంశం ముగిసింది. కాబట్టి, లేఖను ఉపసంహరించుకోవాల్సిన అవసరం లేదు’ అని మంత్రి స్పష్టంచేశారు.