ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (19:08 IST)

జర్నలిస్టులందరికీ ఇళ్లు... మంత్రి కాలవ శ్రీనివాసులు

అమరావతి: రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న కృతనిశ్ఛయంతో ప్రభుత్వం ఉందని సమాచార, పౌరసంబంధాల శాఖ, గృహనిర్మాణ శాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం ఉదయం ఆయన జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధ

అమరావతి: రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న కృతనిశ్ఛయంతో ప్రభుత్వం ఉందని సమాచార, పౌరసంబంధాల శాఖ, గృహనిర్మాణ శాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం ఉదయం ఆయన జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటల సేపు వారి సమస్యలు విన్నారు. తాను కూడా 14 ఏళ్లు స్టాఫ్ రిపోర్టర్‌గా, డెస్క్ జర్నలిస్ట్‌గా పని చేశానని, అందరి సాదకబాధలు తెలుసని చెప్పారు. జర్నలిస్టులు, వారి కుటుంబాల సమస్యలు సాధ్యమైనంతవరకు పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తాన్నారు. 
 
అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇళ్లు నిర్మిస్తామని, ఎవరికీ ఎటువంటి అపోహలు వద్దన్నారు. సీఆర్డీఏ వద్ద భూమి తీసుకొని ప్రభుత్వ సబ్సిడీతో జర్నలిస్టుల భాగస్వామ్యంతో ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో అమరావతిలో నిర్మించే ప్రతిపాదన ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం పేదలకు గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు నిర్మిస్తున్న మాదిరిగా, జర్నలిస్టులకు అదనపు చదరపు అడుగులు, అదనపు సబ్సిడీతో ఇచ్చే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. 
 
ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకారం అమరావతిలో ట్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు నిర్మిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి విధివిధానాలను ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ రూపొందిస్తుందని తెలిపారు. ఈ ఇళ్లు ఎన్ని చదరపు అడుగులు ఉండాలి? ఎంత సబ్సిడీ ఇవ్వాలి? వంటి వాటికి సంబంధించి విస్తృత స్థాయిలో అభిప్రాయాలు సేకరిస్తున్నామని, అందులో భాగంగానే ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. మండల, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాజధాని అమరావతి మొత్తం 3 కేటగిరీలలో ఇళ్లు నిర్మించే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. 
 
గుంటూరు, విజయవాడ, రాజధాని అమరావతిలలో పనిచేసే జర్నలిస్టులకు ఎక్కడ కావాలంటే అక్కడ ఎంచుకునే అవకాశం ఇస్తామన్నారు. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరిలలోని స్థానికులకు కూడా అవకాశం ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో స్థలం ఉండి, ప్రభుత్వం వద్ద స్థలం తీసుకొని ఇళ్లు నిర్మించుకునేవారికి ఈ పథకం పరిధిలో సబ్సిడీ ఇచ్చే ఆలోచన కూడా ఉన్నట్లు తెలిపారు. అందరికంటే ఫొటో జర్నలిస్టులు ఎక్కువగా శ్రమపడతారని, తరచూ పోలీసుల తోపులాటలకు గురవుతుంటారని వారి కష్టం తనకు తెలసునని మంత్రి కాలవ చెప్పారు.
 
వివిధ జర్నలిస్ట్ యూనియన్ల నాయకులు మాట్లాడుతూ అక్రిడేషన్‌తో సంబంధం లేకుడా జర్నలిస్టులు అందరికీ అవకాశం ఉన్నచోట స్థలాలు లేని చోట గ్రూప్ ఇళ్లు, అపార్ట్‌మెంట్లు నిర్మించాలని కోరారు. అమరావతిలో కనీసం వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్ నిర్మించాలన్నారు. జర్నలిస్టుల జీతాలు, వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇంటి నిర్మాణానికి అయ్యే వ్యయంలో 70 నుంచి 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని, ఈ పథకాన్ని సాధ్యమైనంత త్వరగా ఆచరణలోకి తీసుకురావాలని కోరారు. కాల పరిమితి నిర్ణయించి త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రతి యూనియన్‌కు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వివాదాలు, ఆటంకాలు, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, త్వరితగతిన నిర్మాణాలు జరిగేలా చూడాలని కోరారు. మరొకరితో కలపకుండా జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఇళ్లు నిర్మించాలన్నారు.
 
హైదరాబాద్ కేంద్రంగా ఏపీ కోసం పనిచేసే జర్నలిస్టులకు కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతర జర్నలిస్టులకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం సాధ్యపడనందున, వారికి సమీపంలోని ఇతర ప్రాంతాల్లో నిర్మించాలని చెప్పారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి, వారికి కూడా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా జర్నలిస్టుల హెల్త్ కార్డులను కార్పోరేట్ ఆస్పత్రుల వారు ఆమోదించడంలేదని, ఇది సక్రమంగా అమలుకావడానికి ఒక కమిటీని నియమించి నెలకు ఒకసారి సమీక్షించాలన్నారు. తమిళనాడు, కేరళ, అస్సాంలో మాదిరి మన రాష్ట్రంలో కూడా రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేయాలని కోరారు.
 
ఈ సమావేశంలో ఐ అండ్ పీఆర్ అడిషనల్ డైరెక్టర్ మల్లాది కృష్ణానంద్, జాయింట్ డైరెక్టర్ పోతుల కిరణ్, యూనియన్ నాయకులు ఉప్పల లక్ష్మణ్, ఐవి సుబ్బారావు, నల్లి ధర్మారావు, చెవుల కృష్ణాంజనేయులు, జీ.ఆంజనేయులు, అమరయ్య, తిలక్, చందు జనార్ధన్, రాజా రమేష్, నిమ్మరాజు చలపతి రావు, బడే ప్రభాకర్, పున్నమరాజు, ఆనంద్, విజయభాస్కర్, సాంబశివనాయుడు, రమణారెడ్డి, సుబ్బారావు, రంగసాయి, సింహాద్రి కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.