శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 31 జులై 2014 (16:12 IST)

ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీం కోర్టులో ఇంప్లీడ్: ఓయూ

ఎంసెట్ కౌన్సిలింగ్‌పై సుప్రీం కోర్టులో ఇంప్లీడ్ అవుతామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 4న తీర్పు అనుకూలంగా వస్తే యథావిధిగా కౌన్సెలింగ్‌ కొనసాగిస్తామని చెప్పారు. తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలనే దానిపై 5న సమావేశం నిర్వహిస్తామని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
 
ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఉన్నత విద్యామండలి ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా బుధవారం ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్ ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు పిడమర్తి రవి, బాలరాజు స్పష్టం చేశారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేయడానికి ఉన్నత విద్యా మండలి కంకణం కట్టుకుందని వారు ఆరోపించారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు తీర్పు రాకముందే నోటిఫికేషన్ ఎలా ముందుకు వెళ్తారని వారు ఉన్నత విద్యా మండలి ఉన్నతాధికారులను ప్రశ్నించారు. 
 
ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ఆంధ్రా మేధావుల ఫోరం వ్యక్తిగా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఆంధ్ర ప్రాంతంలో జరిగే కౌన్సెలింగ్లో తెలంగాణ కాలేజీల ఎంపిక విషయంలో ఆలోచించుకోవాలని ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు తెలంగాణ విద్యార్థులకు సూచించారు.