శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 30 జులై 2014 (10:42 IST)

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రైతుకూ ఐప్యాడ్ : చంద్రబాబు వెల్లడి

తమిళనాడు రాష్ట్రంలో విద్యార్థులకు లాప్‌టాప్‌లు ఇచ్చిన ముఖ్యమంత్రి జయలలిత ఆ రాష్ట్ర విద్యార్థుల నుంచి జేజేలు అందుకుంటున్నారు. అదే బాటలో నడుస్తూ అందరికీ అన్నం పెట్టే అన్నదాతకి ఐప్యాడ్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోచన చేస్తున్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఉపగ్రహ సమాచారాన్ని చేరువ చేసేందుకు ప్రతి రైతుకు ఐప్యాడ్‌ అందించే ఆలోచన ఉందని చంద్రబాబు తెలిపారు. 
 
భూసార పరీక్షలు, సాగుకు యోగ్యమైన పంటల నిర్ధారణ, మేలైన విత్తనాలు, ఎరువుల మార్కెటింగ్‌ తదితరాలపై రైతులకు దీనిద్వారా ఉపగ్రహ సమాచారం అందుతుందని చెప్పారు. మంగళవారం తన నివాసానికి తరలివచ్చిన రైతు సంఘాల ప్రతినిధుల సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో త్వరలోనే ‘పొలం పిలుస్తోంది’ పేరుతో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు అందరూ పాల్గొనాలని కోరారు. 
 
పదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అశాస్త్రీయ విధానాల వల్ల వ్యవసాయ పరిశోధనలు ఆగిపోయాయన్నారు. వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో కేటాయింపులు పెంచకుండా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రపంచంలోనే వ్యవసాయపరంగా మన దేశం ఎంతో వెనకబడి ఉంటే, అందులో ఆంధ్రప్రదేశ్‌ మరింత వెనుకబడిందన్నారు. వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయి, దిగుబడులు తగ్గిపోయాయని చెప్పారు.