శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2015 (10:17 IST)

జగన్ ఆస్తుల స్వాధీనం కోసం ప్రత్యేక చట్టం... చంద్రబాబు అడుగులు...

వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి చెందిన అక్రమాస్తులను స్వాధీనం చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కారు అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ చట్టాన్ని రూపొందించాలని భావిస్తోంది. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయల మేరకు అక్రమాస్తులు సంపాదించారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెల్సిందే. పైగా.. అక్రమాస్తుల కేసులో జగన్‌ను సీబీఐ అరెస్టు చేసింది కూడా. అలాగే, జగన్‌కు చెందిన వందల కోట్ల రూపాయల విలువ చేసే అక్రమాస్తులను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ స్వాధీనం కూడా చేసుకుంది. 
 
ఈ నేపథ్యంలో... జగన్‌కు చెందిన అక్రమాస్తులన్నిటినీ స్వాధీనం చేసుకుంటామని టీడీపీ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. తాజాగా ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో జగన్ అక్రమాస్తులతో పాటు ఇతరులు పోగేసిన అక్రమాస్తులను కూడా స్వాదీనం చేసుకునే దిశగా చంద్రబాబు ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ చట్టాన్ని కూడా రూపొందించాలని కూడా ప్రభుత్వం దాదాపుగా రంగంలోకి దిగింది. 
 
శనివారం జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అక్రమార్కుల సొమ్ముతో పాటు పాటు వివిధ రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలు కూడా తమకే చెందేవిధంగా చట్టాన్ని రూపొందించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వద్ద చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు వినికిడి. 
 
ప్రస్తుతం ఉన్న చట్టాల ఆధారంగా ఈ తరహా యత్నాలు ఫలించవని, ప్రత్యేక చట్టంతోనే అది సాధ్యమని జైట్లీ సూచించారట. జైట్లీ సూచనలతోనే ఏపీ సర్కారు కొత్త చట్టం రూపకల్పనకు నడుం బిగించిందట. ఇప్పటిదాకా అవినీతి కేసులను దర్యాప్తు చేస్తున్న ఈడీ వంటి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఆయా కేసుల్లో నిందితులు దోషులుగా తేలితే, వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని, వాటిని వేలం వేసి వచ్చిన సొమ్మును కేంద్ర ఖజానాలో జమ చేస్తున్నాయి. 
 
అయితే తమ రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించిన సొత్తు కేంద్ర ఖాతాలో వేయడం సబబు కాదన్న వాదనే కొత్త చట్టం రూపకల్పనకు నాందీ పలికిందని తెలుస్తోంది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు చేపట్టిన కేసుల్లోని ఆస్తులను చేజిక్కించుకోవాలంటే సదరు చట్టానికి కేంద్రం ఆమోదం తప్పనిసరి. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి సూచనల మేరకు తాము రూపొందిస్తున్న ఈ చట్టానికి కేంద్రం ఆమోదం సులువుగానే లభిస్తుందని కూడా చంద్రబాబు ప్రభుత్వం ధీమాగా ఉంది.