శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 24 జనవరి 2017 (07:24 IST)

ఆర్‌కే బీచ్ ఉద్యమాన్ని పవన్ కల్యాణ్ నుంచి జగన్ లాగేసుకున్నారా?

జల్లికట్టుకు కేంద్రం ఆమోద ముద్ర వేయాల్సిందేనంటూ మెరీనా బీచ్‌లో స్వచ్చందంగా గుమికూడిన లక్షలాది తమిళుల స్పూర్తి ప్రత్యేక హోదా విషయంలో తెలుగు ప్రజలకూ కలగాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ యధాలాపంగా చేసిన వ్యాఖ్యను వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమాంత

జల్లికట్టుకు కేంద్రం ఆమోద ముద్ర వేయాల్సిందేనంటూ మెరీనా బీచ్‌లో స్వచ్చందంగా గుమికూడిన లక్షలాది తమిళుల స్పూర్తి ప్రత్యేక హోదా విషయంలో తెలుగు ప్రజలకూ కలగాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ యధాలాపంగా చేసిన వ్యాఖ్యను వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమాంతం ఒడిసిపట్టుకున్నారా? సమాధానం అవుననే చెప్పాల్సి ఉంటుంది.

 
పవన్ కల్యాణ్‌కు ఏ ప్రజాసమస్యపై అయినా సరే వెనకా ముందూ చూసుకోకుండా స్పందించే గుణం ఉంది. కానీ తన ఆవేశాన్ని చాలా సార్లు సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌లో మాత్రమే పంచుకుంటుంటారు. తన బిజీ షూటింగ్ షెడ్యూల్ నుంచి కాస్త విరామం దొరికినప్పుడు మాత్రమే పవన్ కార్యాచరణలోకి దిగుతారు.
 
కాబట్టి జల్లికట్టు కోసం తమిళులు భారీ ఉద్యమం చేపట్టినప్పుడు అప్పటికప్పుడు స్పందించిన తెలుగు ప్రముఖులలో పవన్ ఒకరు. పొరుగు రాష్ట్రంలోని ప్రజల పోరాట స్ఫూర్తిని పవన్ అభినందించారు. ఆంద్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ తెలుగు ప్రజలు కూడా తమిళులు నడిపిన స్థాయిలో జనవరి 26న విశాఖ పట్నం ఆర్కే బీచ్‌లో ఉద్యమం నడపాలని పిలుపిచ్చిన మొదటి వ్యక్తుల్లో పవన్ ఉన్నారు. కానీ ఆయన తనదైన కార్యక్రమం దేన్నీ ప్రకటించలేదు. 
 
ఇక్కడే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగిపోయింది. ప్రత్యేక హోదా ప్రతిపత్తికి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు జరపాలని, ఆర్కే బీచ్‌లో భారీ ర్యాలీని నిర్వహించాలని ప్రకటన చేయడంలో జగన్ పార్టీ క్షణమాత్రం కూడా జాగు సేయలేదు. పైగా రాష్ట్రంలోని యువతీయువకులకు ఈ ఆందోళనలో భాగం పంచుకోవాలంటూ జగన్ పిలుపునిచ్చారు కూడా. 
 
దీంతో ప్రతి ఒక్కరూ జగన్‌ అభ్యర్థనకు ప్రతిస్పందిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫారంలు అన్నింట్లో వైరల్ అయిన జగన్ పిలుపు తక్షణ స్పందనలను రేకెత్తించింది. చివరకు సంపూర్ణేష్ బాబు, తనిష్ వంటి నటులు సైతం జగన్ కాల్‌కి స్పందించడమే కాకుండా ఆర్కె బీచ్ ర్యాలీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.
 
పవన్‌కి లేనిది జగన్‌కి ఉన్న సానుకూల అంశం ఏమిటంటే, భారీ స్థాయి పార్టీ యంత్రాంగమే. ఏమాత్రం ఆలస్యం చేయకుండా జగన్ వెంటనే పనిలోకి దిగుతారు. పవన్‌లో లోపించింది అదే మరి.