శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : బుధవారం, 27 జులై 2016 (15:06 IST)

శ్రీకాళహస్తిలో ఎప్పుడూ జిలేబీల కొరతే...!

తిరుమల శ్రీవారి జిలేబీలకు ఎంతో డిమాండ్‌ ఉంది. వంద రూపాయల జిలేబీని బ్లాక్‌లో వెయ్యి రూపాయల అమ్మిన వైనాన్ని చూశాం. ఏకంగా నకిలీ జిలేబీలు తయారుచేసి విక్రయించిన నకిలీ ముఠాలనూ తితిదే విజిలెన్స్ అధికారులు పట

తిరుమల శ్రీవారి జిలేబీలకు ఎంతో డిమాండ్‌ ఉంది. వంద రూపాయల జిలేబీని బ్లాక్‌లో వెయ్యి రూపాయల అమ్మిన వైనాన్ని చూశాం. ఏకంగా నకిలీ జిలేబీలు తయారుచేసి విక్రయించిన నకిలీ ముఠాలనూ తితిదే విజిలెన్స్ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. తిరుమల జిలేబీలాగే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయ జిలేబీలు బ్లాక్‌లో కొనుక్కోవాల్సిన పరిస్థితులు వచ్చేలా ఉంది. ఎందుకంటే శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల డిమాండ్‌కు తగినట్లు జిలేబీలు తయారు చేయడం లేదు. ప్రసాదాల కౌంటర్‌కు ఎప్పుడు వెళ్ళినా జిలేబీలు అయిపోయాయన్న మాటే వినిపిస్తోంది. భక్తులు నిరాశతో వెనుతిరుగుతున్నారు.
 
శ్రీకాళహస్తీశ్వరాలయంలో దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు లడ్డు, వడ, పులిహోర, జిలేబీ ప్రసాదాలను విక్రయిస్తుంటారు. లడ్డూ, వడ, పులిహోర ఎప్పుడు వెళ్ళినా దొరుకుతాయి. కానీ జిలేబీ మాత్రం ఉదయం 11 గంటలకే అయిపోతుంది. రోజుకు 400 నుంచి 500 జిలేబీలు మాత్రమే తయారు చేస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకునే భక్తుల సంఖ్య బాగానే పెరుగుతోంది. ఒకప్పుడు 10 వేల లోపు ఉండే భక్తులు ఇప్పుడు 30వేల మంది దాకా వస్తున్నారు. 
 
కనీసం ఐదువేల కుటుంబాలు లేదా బృందాలు స్వామిని దర్సించుకుంటున్నాయి. ఈ కుటుంబాల్లో 25శాతం కుటుంబాలు ఒక్కో జిలేబీ తీసుకోవాలనుకున్నా కనీసం 1250జిలేబీలు అవసరం అవుతాయి. కానీ ఇక్కడ తయారవుతున్నవి 500లోపు  ఉంటున్నాయి. అందుకే జిలేబీలకు కొరత ఏర్పడుతోంది. ఉదయం 11గంటలకే అవి అయిపోవడంతో ఆ తరువాత వచ్చే భక్తులు నిరాశ చెందుతున్నారు.
 
శ్రీకాళహస్తి ఆలయ జిలేబీ రుచికరంగా ఉంటుంది. జిలేబీ తయారీకి మైదా, చక్కెర, నెయ్యి ఉపయోగిస్తున్నారు. 11 కేజీల జిలేబీల తయారీకి 5 కేజీల మైదా, 13 కేజీల చక్కెర, 4కేజీల నెయ్యి ఉపయోగిస్తున్నారు. బయట మార్కెట్‌లో జిలేబీల తయారీకి ఉద్దిపప్పు, బియ్యపుపిండి ఉపయోగిస్తున్నారు. అందువల్ల అవి నాలుగైదు రోజులైనా గట్టిగా ఉంటాయని, దేవస్థానంలో మైదా మాత్రమే వినియోగించడం వల్ల మూడు, నాలుగు గంటలకు మించి నిల్వవుండవని పోటు సిబ్బంది చెబుతున్నారు. 
 
ఎక్కువ సమయం నిల్వ ఉంచితే రుచి మారిపోతుందని, అందుకే పరిమిత సంఖ్యలో తయారు చేస్తున్నట్లు వివరిస్తున్నారు. పైగా జిలేబీ తయారు చేయాలంటే మైదాను ముందు రోజే నీళ్ళలో నానబెట్టాలి. ఉదయం తయారు చేయాలి అంటే పెద్ద ప్రక్రియ అన్నమాట. జిలేబీల తయారీకి ఇబ్బందులున్న మాట వాస్తవమే. అయినా వీటికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ జిలేబీలు తయారు చేయడానికి ఏమి చేయాలో పరిశీలించాలి. అదేవిధంగా జిలేబీ కనీసం 2 రోజులైనా నిల్వఉండడానికి ఏమీ చేయాలనేది పరిశీలించాలి. ఏమైనా భక్తులకు అవసరమైన ప్రసాదాలు అందజేయాల్సిన బాధ్యత అధికారులపైనా, పాలకమండలిపైనా ఉంది.