శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (11:16 IST)

సండ్ర అరెస్ట్‌పై జూపూడి ఫైర్ : దళితులపై దాడే.. టీఆర్ఎస్‌లో చేరాలని..?

టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో సండ్రను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

విచారణకు సండ్ర పూర్తిగా సహకరిస్తున్నప్పటికీ... అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏసీబీకి ఏమొచ్చిందని ప్రశ్నించారు. టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా దళిత వ్యతిరేకి అన్నారు. 
 
అందుకే తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ చివరకు తానే సీఎం పీఠాన్ని అధిష్టించారని జూపూడి దుయ్యబట్టారు. డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను పదవి నుంచి తొలగించారని, ఇప్పుడు దళితుడైన సండ్రను అరెస్ట్ చేయించారని మండిపడ్డారు.

టీఆర్ఎస్‌లో చేరాలని గతంలో సండ్రను ఒత్తిడి చేశారని... దానికి సండ్ర అంగీకరించకపోవడంతో ఇప్పుడు అరెస్ట్ డ్రామా చేశారని ఆరోపించారు. కేసీఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు.