శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (13:16 IST)

వైఎస్ఆర్సీపీ కాదు... సైకో పార్టీ అని పెట్టుకోండి : అచ్చెన్నాయుడు

వైఎస్ఆర్ సీపీపై రాష్ట్ర మంత్రి కె అచ్చెన్నాయుడు మరోమారు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వైకాపా కాదు.. సైకో పార్టీ అని పేరు పెట్టుకోండంటూ సూచించారు. దీనికి వైకాపా సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం సభలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేస్తూ.. తమ వాదనను వినిపించటానికి అవకాశం ఇవ్వాలంటూ స్పీకర్ పోడియం వద్దకు చేరి గురువారం విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళన చేయటం ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా స్పీకరు కోడెల శివప్రసాదరావు స్పందిస్తూ విపక్ష సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లిపోవాలని.. పోడియం చుట్టుముట్టటం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సభా సమయాన్ని వృధా చేస్తున్నారని విమర్శిస్తూ.. వైసీపీ కాదని.. సైకో పార్టీ అని పేరు పెట్టుకోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మరింత బిగ్గరగా నినాదాలు చేస్తూ.. మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డారు.
 
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు.. తదనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ నేతల ఆందోళనలతో అట్టుడికిపోవటంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. దీంతో.. సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. విపక్షాలు ఆందోళన చేయటం మామూలే. అంతమాత్రాన.. విపక్ష పార్టీని సైకో పార్టీగా పేరు పెట్టుకోవాలంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం మంత్రి స్థానంలో ఉన్న అచ్చెన్నాయుడుకు సరికాదన్న వాదన వినిపిస్తోంది.