శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 4 జులై 2015 (16:40 IST)

గవర్నర్‌ నరసింహన్‌ను తొలగించండి .. రాజ్‌నాథ్‌కు మర్రి శశిధర్ రెడ్డి లేఖ

రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను తక్షణం తొలగించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు టీ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌ రెడ్డి శనివారం ఓ లేఖ రాశారు. తెరాస ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారంలో గవర్నర్ నరసింహన్ రాజ్యాంగబద్దంగా తన విధులను నిర్వర్తించలేదని మర్రి ఆ లేఖలో పేర్కొన్నారు.
 
సనత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ టిక్కెట్‌పై గెలుపొందిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకోగా, ఆయన చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారన్నారు. ఈ క్రమంలో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ 2(1) అంశాన్ని గవర్నర్ ఉల్లంఘించారని వివరించారు. సభ్యుడు కానటువంటి వ్యక్తిని ఆరు నెలలకుమించి కొనసాగించడం రాజ్యాంగ వ్యతిరేకమవుతుందని కేంద్రం దృష్టికితీసుకెళ్లారు. 
 
ఈ నేపథ్యంలో తలసానిని వెంటనే తొలగించేలా గవర్నర్‌ను కేంద్రం ఆదేశించాలని లేఖలో కోరారు. తలసాని విషయంలో ప్రభుత్వానిదే తప్పని మొదట అనుకున్నానని, కానీ మొత్తం ఎపిసోడ్‌లో గవర్నర్‌దే బాధ్యత అని తెలుస్తోందన్నారు. దాంతో పార్టీ ఫిరాయింపులను గవర్నర్ చర్య ప్రోత్సహించినట్లయిందన్నారు.