శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (10:10 IST)

స్వీయ గృహ నిర్బంధంలో ముద్రగడ.. కిర్లంపూడిలో ఉద్రిక్తత...

కాపులకు రిజర్వేషన్ల కోసం ఆమరణ దీక్ష చేపట్టిన కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మూడో రోజు అయిన ఆదివారం కూడా దీక్షను కొనసాగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలోని తన సొంతింటిలోనే సతీసమేతంగా ఆమరణ దీక్షకు దిగిన ముద్రగడ, లక్ష్యం నెరవేరే దాకా దీక్ష విరమించేది లేదని తేల్చిచెప్పారు. 
 
దీక్ష చేపట్టి మూడు రోజులవుతున్న నేపథ్యంలో ముద్రగడ దంపతుల ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలతో నేటి ఉదయం వారిద్దరికీ వైద్యులు బలవంతంగా పరీక్షలు చేయబోయారు. అయితే ముద్రగడ వైద్య పరీక్షలకు ససేమిరా అన్నారు. ఈ సమయంలోనే జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్‌లు ముద్రగడ ఇంటిలోకి వెళ్లారు. వారి వెంట కొంతమంది పోలీసులు కూడా తన ఇంటిలోకి ప్రవేశించడంతో ముద్రగడ ఆగ్రహోదగ్రులయ్యారు. 
 
ఎక్కడ తన దీక్షను భగ్నం చేస్తారోనన్న ఆందోళనతో తన గదిలోకి వెళ్లిన ఆయన తలుపులేసేసుకున్నారు. తద్వారా తనకు తాను ఆయన స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనుమతి లేకుండా ఇంటిలోకి ప్రవేశించిన జాయింట్ కలెక్టర్, ఎస్సీలతో ముద్రగడ అనుచరులు వాగ్వాదానికి దిగారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొండి అయితే... నేను జగమొండినని మాజీ మంత్రి, కాపులను బీసీల్లో చేర్చాలని ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. హామీలు నెరవేర్చే వరకు దీక్ష విరమించేది లేదన్నారు. అలాగే సీఎం చంద్రబాబుపై ముద్రగడ తీవ్ర విమర్శలు చేశారు. రూ.2 లక్షల నుంచి రూ.2 లక్షల కోట్లకు చంద్రబాబునాయుడు ఎలా ఎదిగారో చెప్పాలన్నారు. చంద్రబాబు నాయుడు ఆ కిటుకు ఏమిటో చెబితే ఈ దేశంలో ఎవరికీ రిజర్వేషన్లు అవసరం ఉందన్నారు.