శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (16:18 IST)

అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్‌ను స్వయంగా ఆహ్వానిస్తా: బాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను స్వయంగా తానే ఆహ్వానిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో అన్నారు. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీచే రాజధానికి శంకుస్థాపన జరుగనున్న నేపథ్యంలో.. ప్రధాన వేదికపై 15 మంది అతిథులను మించకుండా చూసుకోవాలని ప్రధాని కార్యాలయం వెల్లడించినట్లు బాబు తెలిపారు. 
 
ప్రధాని కార్యాలయ సూచన మేరకు వేదికపై ఎక్కువ మంది లేకుండా చూడాలని మంత్రివర్గ సహచరులకు చంద్రబాబు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆహ్వాన పత్రాలు అందించాలని మంత్రులకు సూచించారు. అలాగే కేబినెట్ సమావేశంలో ఏపీ రాజధాని ఆహ్వాన పత్రాన్ని బాబు ఆవిష్కరించారు. ఇదే సమయంలో మంత్రులకు, అధికారులకు కూడా ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఆదివారం నుంచే శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రాలు ఇచ్చి.. పలువురిని ఆహ్వానించనున్నారు. 
 
మరోవైపు అమరావతి నిర్మాణానికి త్వరలో పర్యావరణ అనుమతులు రానున్నాయని పర్యావరణ అనుమతుల కమిటీ నుంచి సీఆర్డీఏ అధికారులకు సమాచారం అందింది. ఈ నెల 12, 13 తేదీల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.